మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు. కుటుంబంతో కలిసి లండన్, యూకే వెళ్లి అక్కడ చదువుకుంటున్న కుమార్తెను చూడానలి ఉందని, అందుకు 20రోజులు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి కోర్టు లో పిటిషన్ వేశారు. సహజంగానే సీబీఐ దీనికి అభ్యంతరం తెలిపింది. ఆయనమీద అవినీతి కేసులు విచారణ కీలకదశలో ఉన్నందున ఈ సమయలో ఆయనను విదేశాలకు అనుమతించడం కరెక్టు కాదని సీబీఐ తెలియజేసింది. కోర్టు ఈ విషయంలో తీర్పు వెలువరించాల్సి ఉంది.
అదలా ఉంచితే.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ1, ఏ2 ఇద్దరూ కూడా ఒకేసారి తాము విదేశాలకు వెళ్లాల్సిన పని ఉన్నదని కోర్టును అనుమతి కోరడమే తమాషా. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల పోలింగు ముగిసిన తరువాత.. ఫలితాలు వెలువడే లోగా ఒకసారి కోర్టు అనుమతి తీసుకుని విదేశాలలోని కూతురు వద్దకు వెళ్లివచ్చారు. మూడు నెలలు కూడా గడవక ముందే మళ్లీ విదేశాలకు వెళ్లాలని ఆయన కోర్టు అనుమతి కోరడం విశేషం.
విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్లాలని అనిపించింది. ఆయన కూడా సీబీఐ కోర్టు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ పిటిషన్ 30న విచారణకు రానుంది. దాదాపు లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలు ఇద్దరికీ ఒకేసారి విదేశాలకు వెళ్లాలనే ఆలోచన రావడం.. అది కూడా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రావడం యాదృచ్ఛికమేనా దీని వెనుక ఏమైనా ప్లాన్ ఉన్నదా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.