బోరుగడ్డ బెయిల్ రిజెక్షన్ : అందరికీ హెచ్చరికే!

బోరుగడ్డ అనిల్.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, రచ్చకెక్కిన రౌడీషీటర్లలో ఇంతగా పాపులర్ అయిన వారు మరొకరు లేరు. పోలీసులు వివిధ కేసుల్లో విచారణ చేస్తుండగా.. తాను వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా పనిచేశానని చెప్పుకున్న వ్యక్తి ఈ అనిల్. అలాగే.. ఒక రౌడీషీటరు అయిఉండీ.. కత్తిచూపించి దందాలు సాగిస్తూ.. ప్రత్యేకించి తనకు ఒక గన్ మ్యాన్ ను సెక్యూరిటీగా పొందిన ఘనుడు. జగన్ సలహాదారు గనుకనే.. తనకు గన్ మ్యాన్ ను ప్రభుత్వం కల్పించిందంటూ చెప్పుకున్నాడు. అలాంటి బోరుగడ్డ అనిల్ బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించగా, నిర్ద్వంద్వంగా ఆ పిటిషన్ ను తోసిపుచ్చారు. సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య పోస్టులు పెట్టడం గురించి ఆయన మీద నమోదైన కేసుల్లో బెయిలు కోసం వెళ్లగా.. తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం తిరస్కరించింది.

జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైకోలు ఎంతెంత దారుణంగా రెచ్చిపోతూ అసభ్య పోస్టులు పెట్టారో ప్రజలందరికీ తెలుసు. అప్పట్లో అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయిన వారు ఇప్పుడు కేసులను, విచారణలను ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలా మంది బుద్ధి తెచ్చుకుని, లెంపలు వాయించుకుని జీవితంలో మళ్లీ ఇలాంటి తప్పు చేయబోం మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలోనే వేడుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ జమానాలో.. ఆయన ఎవరు విమర్శించినా సరే వారి మీద అత్యంత నీచమైన భాషలో అసభ్య పోస్టులు పెడుతూ చెలరేగిన బోరుగడ్డ అనిల్.. తాజాగా బెయిలుకోసం ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు.

ఈ సందర్భంగా కేసు వివరాలను, పోలీసుల వాదనలను పరిశీలించిన ధర్మాసనం.. నిందితుడు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా? అంటూ వ్యాఖ్యానించడం విశేషం. ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదంటూ తేల్చి చెప్పింది.

బోరుగడ్డ అనిల్ బెయిలు పిటిషన్ రిజెక్ట్ అయిన తీరు సోషల్ మీడియా సైకోలందరికీ ఒక హెచ్చరిక లాంటిదని పలువురు విశ్లేషిస్తున్నారు. తప్పుడు పోస్టులు పెడుతూ.. ఒకవైపు పలువురు కేసుల్లో చిక్కుకుంటూ ఉండగా.. సోషల్ మీడియాలో ఇంకా రెచ్చిపోండి.. ఎక్కడా వెనక్కు తగ్గొద్దు.. మీమీద కేసులు వస్తే మేం చూసుకుంటాం.. అంటూ వైసీపీ పెద్దలు వారిని మరింతగా రెచ్చగొడుతున్న సంగతి అందరికీ తెలుసు. అయితే వారి మాటలు విని రెచ్చిపోతే నాశనమయ్యేది తమ జీవితాలే అని ఈ సైకోలు తెలుసుకుంటున్నారు. బోరుగడ్డ అనిల్ పెద్ద ఉదాహరణ అని.. తామందరమూ కూడా ఎక్స్‌ట్రాలు చేయకుండా అదుపులో ఉండాలని అందరూ పాఠం నేర్చుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories