వైసీపీ నుంచి కాంగ్రెసులోకి బోణీ : జగన్‌కు నష్టమెలాగంటే?

జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణను వదలి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా రాజకీయం చేయడం ప్రారంభించిన తర్వాత.. నష్టమెవరికి? పసిపిల్లలను అడిగినా కూడా నష్టం జగన్మోహన్ రెడ్డికే అని స్పష్టంగా చెబుతారు. జగన్ కు ఉండేది వైఎస్సార్ అభిమాన ఓటు బ్యాంకు మాత్రమే కాబట్టి.. సదరు ఓటు బ్యాంకు మీద వైఎస్సార్ కొడుకుగా జగన్ కు ఎంత హక్కు ఉన్నదో, అదేమాదిరిగా ఆయన కూతురు షర్మిలకు కూడా అంతే హక్కు ఉంటుందని.. వైఎస్సార్ ను అభిమానించే ప్రజలు ఆమెను కూడా సమానంగా ఆదరిస్తారని అందరి అంచనా. కేవలం వైఎస్సార్ అభిమాన ఓటు బ్యాంకు రూపంలో మాత్రమే కాదు. మరో రకంగా కూడా జగన్ ఓటు బ్యాంకుకు గండిపడనుంది. దానికి సంబంధించిన సంకేతం.. తాజాగా వ్యక్తమైంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నందికొట్కూరు సిటింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ తాజాగా షర్మిల సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. జగన్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆర్థర్ పేరు లేదు. సాధారణంగా జగన్ టికెట్ తిరస్కరించిన వారంతా ఏదో ఒక పార్టీలో చేరడం జరుగుతూనే ఉంది. తెలుగుదేశం జనసేన పార్టీల్లో చేరడానికి, స్థానిక పరిస్థితుల దృష్ట్యా అవకాశం లేకపోతే కాంగ్రెసులోకి చేరవచ్చు కూడా. కానీ..  ఆర్థర్ తేలికను అంత తేలికగా తీసుకోడానికి వీల్లేదు. ఇందులో మరొక కోణం కూడా ఉంది. క్రిస్టియన్ నాయకుడిగా ఆర్థర్ కు ఏకైక ప్రత్యామ్నాయంగా షర్మిల నేతృత్వం కనిపించి ఉండవచ్చు.

జగన్ కు బలంగా నిలుస్తున్న ఓటు బ్యాంకుల్లో క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా ఒకటి. ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రి అవుతున్నారంటే.. వారంతా ఏకీభావంతో మద్దతిచ్చే అవకాశం ఉంది. 2019లో కూడా అదే జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. క్రిస్టియన్ ఓటు బ్యాంకు కూడా చీలుతోంది. నిజానికి జగన్ తిరస్కరించిన చాలా మంది నాయకులు షర్మిలవైపు రావడానికి మొగ్గు చూపుతున్నప్పటికీ..కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని సాహసించడం లేదు. కానీ.. ఆర్థర్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా పార్టీలో చేరారు. నందికొట్కూరు నుంచి ఆయన కాంగ్రెస్ తరఫున బరిలో ఉండబోతున్నారు. ఈ సంకేతం రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లలో మారుతున్న ధోరణికి, జగన్ ను వద్దనుకుని షర్మిలకు మద్దతిచ్చే అవకాశం ఉన్నదనడానికి ఉదాహరణగా పలువురు భావిస్తున్నారు.

వైసీపీ నుంచి కాంగ్రెసులోకి ఇంకా పలువురు నేతలు వస్తారనే ప్రచారం ఉంది. కాపు రామచంద్రారెడ్డి లాంటి నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరడానికి మంతనాలు జరిపారు. అయితే.. ఆయన బిజెపిని తొలి ప్రాధాన్యంగా చూస్తున్నారు. వారితో కూడా టచ్ లో ఉన్నారు.
ఆ పరిణామాలన్నీ ఎలా ఉన్నప్పటికీ.. షర్మిల కాంగ్రెస్  చీఫ్ కావడం వలన, ఏపీలో జగన్ కు వైఎస్ఆర్ ఓటు బ్యాంకు మాత్రమే కాదు, క్రిస్టియన్ ఓటు బ్యాంకుకు కూడా గండి పడే ప్రమాదం ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories