చంద్రబాబునాయుడు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఊపు ఇచ్చేలాగా.. ఆ రంగంలో చురుగ్గా కార్యకలాపాలు జరిగేలాగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారు. అదే ఇసుక విషయంలో ప్రజల నడ్డి విరిచేస్తూ భారీ ధరలకు విక్రయించి, వక్రమార్గాల్లో వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న జగన్మోహన్ర రెడ్డి మరియు ఆయన అనుచరగణాలు ఇప్పుడు చిత్రంగా స్పందిస్తున్నాయి. ప్రత్యేకించి ఇసుక ప్రజలకు మరింత సులువుగా అందుబాటులోకి రావడానికి చంద్రబాబు.. సీనరేజీ చార్జీలను కూడా రద్దు చేస్తే.. జగన్ దళాలు మాత్రం దాని మీద వక్రప్రచారాలకు దిగుతున్నాయి. అదంతా తమ ఘనతే అని సొంత డబ్బా కొట్టుకుంటున్నాయి. చాలా తమాషాగా జగన్మోహన్ రెడ్డి కరపత్రిక ఎలాంటి ప్రచారం చేస్తున్నదంటే.. ‘వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో పాటించిన విధానాలనే అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట.’
ఉచిత ఇసుక అనే విధానంలో గానీ, సీనరేజీ చార్జీలను రద్దు చేయడం అనే సౌలభ్యం విషయంలో గానీ.. అసలు జగన్మోహనరెడ్డి ప్రభుత్వ విధానాన్ని మళ్లీ తీసుకురావడం అనేది ఎక్కడున్నదో బహుశా నీలి బుద్ధుల మేధావులకే తెలియాలి. జగన్మోహనరెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత.. అత్యంత పాశవికంగా ఒక ఏడాది పాటు ఏపీలో నిర్మాణరంగాన్ని స్తంభింపజేసి, ఆ రంగం మీద ఆధారపడి కూలీల కడుపులుకొట్టారు, వారి ఆత్మహత్యలకు, ఆకలిచావులకు కారకులయ్యారు. ఆతర్వాత తీసుకువచ్చిన ఇసుకవిధానం ద్వారా.. వేల కోట్లరూపాయలు దోచుకున్నారు. జగన్ దోపిడీకి ప్రజలు తల్లడిల్లిపోయారు.
ఉచిత ఇసుక అనే చంద్రబాబు హామీ వారికి ఒక ఊరటలాగా కనిపించింది. తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఆ విధానం తీసుకువచ్చారు. చంద్రబాబునాయుడు. సీనరేజీ, పంచాయతీలకు జమ అయ్యే పన్నులు మాత్రం చెల్లించి ఇసుక తీసుకువెళ్లవచ్చునన్నట్టుగా విధానాన్ని రూపొందించారు. అయితే సీనరేజీ విషయంలో హెచ్చుతగ్గులు వస్తుండడంతో ముఖ్యమంత్రి ఏకంగా సీనరేజీ చార్జీలనే పూర్తిగా రద్దు చేసేశారు. దానివల్ల పడగల 200 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం తట్టుకోగలదని చెప్పారు. ఆయన ఇంత మేలు చేస్తూంటే.. అదంతా తమ ఘనతే అన్నట్టుగా, జగన్ పాలనలో ఉన్న విధానాన్నే అనుసరిస్తున్నట్టుగా నిస్సిగ్గుగా డప్పు కొట్టుకోవడం జగన్ నీలిదళాలకు మాత్రమే చెల్లింది.
జగన్ పరిపాలన కాలంలో ఒక్క ఇసుక రేణువునైనా ప్రజలను ఉచితంగా తీసుకువెళ్లనిచ్చారా? ఇవాళ చంద్రబాబునాయుడు- సొంతంగా ట్రాక్టరు నదివద్దకు, వాగుల వద్దకు తీసుకువెళితే.. కావాల్సినంత ఇసుకను తవ్విపోసుకుని ఉచితంగా తీసుకువెళ్లవచ్చు అంటున్నారు. ఇలాంటి విధానాన్ని జగన్ పాలనలో అసలు ప్రజలు ఊహించగలిగారా? చంద్రబాబు చేసే మంచి పనులను మంచి అనడానికి మనసు అంగీకరించక.. అవి జగన్ విధానాలే అని చెప్పుకొన్నంత మాత్రాన ప్రజలు చులకనగా నవ్వుతారనే భయం వైసీపీకి లేదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.