భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు.. తెలుగుదేశం పార్టీకి, మొత్తం ఎన్డీయే కూటమికి కూడా ముస్లిం వర్గం సమూలంగా దూరం అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ ఆశపడింది. కానీ వాస్తవంలోకి వస్తే.. వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లో మూడు పార్టీలు జట్టుకట్టాయో.. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు తెలియజెప్పడంలో కూటమి పార్టీలు విజయం సాధించాయి. ప్రత్యేకించి ముస్లిం ఓటు బ్యాంకు తమకు దూరం కాకుండా.. చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ముస్లిం నాయకులు, ప్రజాప్రతినిధులు బయటకు వస్తున్నారు. జగన్ తమకు అన్యాయం చేశాడని అంటున్నారు. పదవులు ఆశించకుండా, బేషరతుగా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ పరిణామాలన్నీ వైసీపీకి, వారి నీలిప్రచారాన్ని కొనసాగిస్తూ ఉండే సోషల్ మీడియా దళాలకు మింగుడుపడడం లేదు. తెలుగుదేశం కూటమికి ముస్లిం ఓటును ఎలా దూరం చేయాలా అనే కుట్రల్లో భాగంగా బిజెపి సారథి పురందేశ్వరికి ముడిపెట్టి కొత్త దుష్ప్రచారాన్ని ప్రారంభించారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఆపాదించి అబద్ధాలు చెబితే ముస్లింలు కూడా నమ్మరనే ఉద్దేశంతో నీలిదళం సోషల్ మీడియా వర్గాలు పురందేశ్వరిని ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో ముస్లింలకు కల్నిస్తున్న 4 శాతం రిజర్వేషన్ ను ఎత్తివేస్తామని పురందేశ్వరి చెప్పినట్టుగా వార్తలు పుట్టించారు.
అయితే.. ఈ పుకార్లను పురందేశ్వరి స్వయంగా ఖండించారు. తనకు సంబంధంలేని , తాను ఎన్నడూ అనని మాటలను తన పేరుతో ప్రచారంలో పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆమె వ్యాఖ్యానించారు. మోడీ సర్కారు ముస్లింల సంక్షేమానికి ఎన్నెన్ని అద్భుత నిర్ణయాలు తీసుకున్నదో కూడా ఆమె ఏకరవు పెట్టారు. అయితే, గమనించాల్సింది ఏంటంటే.. వైసీపీ దళాలు తొలినుంచి కూడా.. పురందేశ్వరిని టార్గెట్ చేస్తున్నాయి. ఆమె చంద్రబాబునాయుడు కోవర్టుగా భాజపాలో పనిచేస్తున్నదని ఏకంగా సజ్జల వంటి వారే దుష్ప్రచారాన్ని సాగించిన తీరు అందరూ గమనించారు. అలాంటిది ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకును దూరం చేసేందుకు ఇలాంటి లేకికుట్రలకు పాల్పడడం హేయంగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.