జగన్మోహన్ రెడ్డికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. జగనన్న మాత్రం కించిత్తు చీమ కుట్టినట్టయినా పట్టించుకోవడం లేదు. సీనియర్లు అందరూ వెళ్లిపోతున్నారు కదా సార్ అని నాయకులు అడిగితే.. ‘సీనియర్లు ఎవరు పోయారన్నా’ అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. చూడబోతే జగన్ కు ఎవరు పోయారో.. ఎవరు ఉన్నారో కూడా తెలియదు లాగుంది. ‘పోతే పోనీండి అన్నా.. ఒకరు పోతే మరొకరు వస్తారు..’ అంటున్నారు. నిజం చెప్పాలంటే పోయేవాళ్లే తప్ప వచ్చేవాళ్లు కనిపించడం లేదు. వెయిటింగ్ లిస్టులో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని దెబ్బలు పడబోతున్నాయని కూడా తెలుస్తోంది. నిన్నటికి నిన్న జగ్గయ్యపేట దెబ్బపడిన తర్వాత విజయనగరం జిల్లాలో అంతకంటె పెద్ద దెబ్బ పడింది.
అక్కడ జిల్లా పార్టీలోనే కీలకంగా ఉండే అవనాపు, జరజాపు కుటుంబాలు పార్టీకి రాజీనామా చేసేశాయి. వారు కూడా జనసేనలో చేరడానికి నిర్ణయించుకున్నారు. విజయనగరంలో పార్టీ సీనియర్ నేత అవనాపు విక్రమ్ మాట్లాడుతూ.. తప్పుడు పనులు చేస్తున్న వ్యక్తులకు అండగా ఉంటున్నందువల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఆయన భార్యతో పాటు, సాలూరు మునిసిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి, జరజాపు ఈశ్వరరావు తదితరులు రాజీనామాలను ప్రటకించారు. సాలూరు మునిసిపాలిటీలోని పది మంది కౌన్సిలర్లు సహా జనసేనలో వారు చేరబోతున్నారు.
కేవలం జిల్లాలో కీలకమైన రెండు కుటుంబాలు పార్టీని వీడడం మాత్రమే కాదు.. ఈ దెబ్బతో సాలూరు మునిసిపాలిటీ కూడా వైసీపీ చేజారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అది జనసేన చేతికి వెళ్లే అవకాశం కూడా ఉంది. స్థానికంగా తెలుగుదేశంతో పొసగని వాతావరణం ఉన్న చోట.. వైసీపీని వద్దనుకుంటున్న నాయకులు అందరికీ కూడా జనసేన ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన బలం కూడా పెరిగే వాతావరణం ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే ఉదయబాను జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించిన తరువాత.. అక్కడ కౌన్సిలర్లు పెద్దసంఖ్యలో జనసేనలోకి వెళ్లబోతున్నట్టు తేల్చేశారు. అదే తరహాలో సాలూరు మునిసిపాలిటీ కూడా జనసేన వశం కాబోతున్నది.
రాష్ట్రంలో ఇంకా పలు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడడానికి నాయకులు ఇతర పార్టీలతో మంతనాలు సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఇంకా వెయిటింగ్ లిస్టులో చాలా దెబ్బలున్నాయని ప్రజలు అంటున్నారు.