వెనకటికి గ్రామీణ పరిభాషలో ఒక ముతక సామెత ఉంటుంది. ఆ సామెత కాకపోయినప్పటికీ.. ఆ సామెత చెప్పే కంటెంట్ మాత్రం ఇప్పుడు వైసీపీ నాయకులకు అతికినట్టుగా సరిపోయేలా ఉంది. తప్పుడు పనులు చేయడానికి అలవాటు పడిన వారు అబద్ధాలు చెప్పడం నేర్చుకోకుండా ఉంటారా? అని తర్కించుకోవాల్సి వస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న వ్యవహార సరళి అలాగే కనిపిస్తోంది.
వాడుకున్నంత కాలం వాడుకున్నారు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిన కార్యకర్తలను మాకు సంబంధం లేదు అంటూ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్న అబద్ధాలు గమనిస్తే.. ఆ పార్టీకోసం పనిచేస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
వైసీపీ తరఫున జగన్ మీద అతి భక్తిని ప్రదర్శించుకుంటూ.. అడ్డగోలుగా నీచమైన పోస్టులు పెట్టినవారిని పార్టీ ఇప్పుడు వదిలించుకునేలా ఉంది.
వైసీపీ సోషల్ మీడియా సైకోలు చాలా మందే ప్రస్తుతం నోటీసులు అందుకుంటున్నారు. అరెస్టులు అవుతున్నారు. అందరూ అరెస్టు కావడం ఒక ఎత్తు. గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్, పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి ఇద్దరూ అరెస్టు కావడం ఒక ఎత్తు. ఈ ఇద్దరూ పూర్తి స్థాయి సాక్ష్యాధారాలతో పీకలదాకా ఇరుక్కుపోయారు. వారిని తప్పించడం తమ చేతుల్లో లేదని వైసీపీ వారికి అర్థమైపోయినట్టుగా ఉంది. వారి కోసం ప్రయత్నించడం ప్రారంభిస్తే.. పార్టీ పరువు పోతుందని వారు భయపడుతున్నట్టుగా ఉంది.
తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మాట్లాడుతూ.. బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డిలతో తమ పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. అలాగే.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తల పేరుతో సోషల్ మీడియా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. వాటిద్వారా తెలుగుదేశం వారే అసభ్య పోస్టులు పెడుతున్నారని, తిరిగి వారే కేసులు పెట్టి తమ వారిని అరెస్టు చేస్తున్నారని గుడివాడ ఆరోపిస్తున్నారు.
హఠాత్తుగా బోరుగడ్డ అనిల్, వర్రా రవీందర్ రెడ్డిలను వైసీపీ ఎందుకు వదిలించుకున్నట్టు? తెరవెనుక అసలు సీక్రెట్ గురించి రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు పోలీసుల విచారణలో వెల్లడించిన వాస్త్తవాల వల్ల వైసీపీ పెద్ద తలకాయలు కూడా కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పెద్దలను కాపాడుకునేందుకు.. వారిద్దరినీ వారి మానాన వదిలేసినట్టుగా కనిపిస్తోంది.
బోరుగడ్డ అనిల్ విచారణలో.. తాను జగన్మోహన్ రెడ్డికి సలహాదారునని, అందుకే ఆ ప్రభుత్వం తనకు గన్ మెన్ కూడా ఇచ్చిందని పేర్కొనడం విశేషం. ఒక రౌడీషీటరుకు గన్ మెన్ ఇవ్వడం అనేది జగన్ హయాంలో ఎలా జరిగిందో అంతుబట్టని సంగతి. బోరుగడ్డ వాంగ్మూలం ఆధారంగా జగన్ మీద కూడా కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది. అలాగే.. వైఎస్ భారతి పిఏగా ప్రచారం జరిగిన వర్రా రవీందర్ రెడ్డి విషయం కూడా అంతే. స్వయంగా అవినాష్ రెడ్డినుంచి కంటెంట్ వస్తేనే తాను పోస్టు చేసేవాడినని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ కేసుల్లో అవినాష్ రెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిన, అరెస్టు అయ్యే పరిస్థితి దాపురించేలా ఉంది. అందుకే వైసీపీ ముందు జాగ్రత్తగా ఈ ఇద్దరితో తమకు సంబంధం లేదని వదిలించుకున్నట్టుగా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.