భూమన కన్ఫెషన్ : టీటీడీని కోవర్టులతో నింపాం!

భూమన కరుణాకర రెడ్డి ఏదో ఆవేశంలో అసలు విషయాలను ఒప్పుకున్నారు. టీటీడీ వ్యవస్థను మొత్తం తన కోవర్టులతో నింపి ఉన్నట్టుగా ఆయన స్వయంగా వెల్లడించారు. అదేదో మహా ఘనకార్యం చేసినట్టుగా.. తిరుమల తిరుపతి దేవస్థానాల సంస్థకు మహోపకారం చేసినట్టుగా  ఆయన ఘనతగా చెప్పుకుంటున్నారు గానీ.. ఎంత దుర్మార్గమైన దూరదృష్టి ప్రణాళికతో ఆయన తన కోవర్టులను సంస్థలోకొ ప్రవేశపెట్టారో ఆ మాటలను గమనిస్తేనే అర్థం అవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలికి మూడుసార్లు సారథ్యం వహించిన భూమన కరుణాకర్ రెడ్డి.. ఈ కోవర్టులను చొప్పించడంతో పాటూ సంస్థలో ఇంకెన్ని దారుణాలకు పాల్పడ్డారో కదా.. అనే అనుమానం ఇప్పుడు కొత్తగా జనంలో మొదలవుతోంది.

టీటీడీ గోశాలలోని ఆవుల మరణాల గురించి కొన్ని రోజులుగా రాద్ధాంతం జరుగుతున్న సంగతి తెలిసిందే. భూమన కరుణాకర రెడ్డి కొన్ని ఫోటోలను చూపించి.. ఈ ఆవులన్నీ చనిపోయాయి.. ఇటీవలి మూడు నెలల కాలంలో ఏకంగా వందకు పైగా ఆవులు మరణించాయి.. అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. దాని మీద నానా రచ్చ అవుతోంది. ఆయన తప్పుడు ఫోటోలు చూపించి.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ టీటీడీ విరుచుకు పడుతోంది. కేవలం సస్పెన్షన్ లో ఉన్న అధికారి హరినాధరెడ్డి కోసం ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు.

తాను చూపించినవి మార్ఫింగ్ ఫోటోలు కాదని, నిజమైన ఫోటోలు అని సమర్థించుకునే ప్రయత్నంలో భూమన నిర్ఘాంతపరిచే విషయాలు వెల్లడించారు. టీటీడీలో పనిచేస్తున్న రెండు వేల మంది ఉద్యోగులు తన నిఘా నేత్రాలంటూ ఆయన వెల్లడించారు. అంటే.. ఇంచుమించుగా టీటీడీ వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడానికి రెండు వేల మంది కోవర్టులు తనకోసం పనిచేస్తున్నారని ఆయన పరోక్షంగా వెల్లడిస్తున్నారు. సంస్థలో జరుగుతున్న పరిణామాలపై వారంతా ఎప్పటికప్పుడు తనకు సమాచారం చేరవేస్తుంటారని మూడుసార్లు ఛైర్మన్ గిరీ వెలగబెట్టిన భూమన అంటున్నారు.
దేవుడి సేవకు ఆయనకు మూడుసార్లు అవకాశం వచ్చింది. అయితే ఆయన తన తైనాతీలను. తొత్తులను, తన దళారీలను అధికారికంగా టీటీడీ ఉద్యోగులుగా నియమించేసి.. వారినందరినీ తన వేగుల్లాగా, కోవర్టులాగా వాడుకుంటున్నారని అర్థమవుతోంది.

టీటీడీలో ఏమైనా లోపాలు జరుగుతున్నాయేమోనని గమనించి.. ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడానికి రెండు వేల మంది పనిచేస్తున్నప్పటికీ కూడా.. భూమన ఇప్పటిదాకా ఆవుల మరణాల గురించి మాత్రమే కొత్త విమర్శలు చేశారు. అంటే టీటీడీలో ప్రతి వ్యవహారం  చాలా సవ్యంగా నడుస్తున్నట్టే అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. గొప్పలు చెప్పుకోబోతూ.. భూమన తాను చేసిన దుర్మార్గాలను చాటుకున్నారని అంతా అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories