పరకామణి చోరీలో.. సెల్ఫ్ గోల్ వేసిన భూమన!

అందంగా మాట్లాడడం ద్వారా అబద్ధాలను నిజం చేసేయవచ్చునని నమ్మే వ్యక్తుల్లో భూమన కరుణాకర రెడ్డి కూడా ఉంటారు. పరకామణి చోరీ వ్యవహారంలో ఆయన మాటలు ఇప్పుడు సెల్ఫ్ గోల్ అయినట్టుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. రవికుమార్ చోరీ కేసును లోక్ అదాలత్ లో రాజీ కుదుర్చుకోవడం ద్వారా.. భారీగా కాజేసినట్టుగా ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ రాజీ వ్యవహారంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. అయితే దీనికి కౌంటర్ ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టిన భూమన కరుణాకర రెడ్డి.. తలాతోకాలేని వాదన వినిపించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. తాము రాజీ కుదర్చుకుని, నిందితుడి నుంచి వెనక్కు రాబట్టామని.. కానీ.. నిజానికి అతను అంతకు చాలా కాలం ముందునుంచి అంటే తెలుగుదేశం పాలన కాలం నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నాడని ఆయన చెప్పుకున్నారు. తెలుగుదేశం కాలం నుంచి దోచుకుంటూ ఉండగా, వారు పట్టించుకోలేదని, తామే దానిని కనిపెట్టి రాబట్టామని ఆయన అంటున్నారు.

ఇప్పుడు ఆ తప్పుడు రాజీ వ్యవహారం బయటపడిన తర్వాత.. నంగినంగిగా మాట్లాడుతున్న భూమన కరుణాకర రెడ్డి.. తెలుగుదేశం పాలన కాలంనుంచి దోపిడీ సాగుతూనే ఉన్నదని వల్లిస్తున్నారు. అదే నిజమైతే.. ఆయన కాలంలో ఆయన గుర్తించినప్పుడు.. ఈ దోపిడీ తెలుగుదేశం కాలంనుంచి జరుగుతూనే ఉన్నదని ఎందుకు బయటపెట్టలేదు. తెలుగుదేశం వాళ్లతో కూడా భూమన కరుణాకర రెడ్డి లాలూచీ పడ్డారా? అనేది ఇప్పుడు సందేహం. ఒకవేళ తెలుగుదేశం కాలం నుంచి రవికుమార్ దోచుకుంటున్న సంగతి నిజమే అయితే గనుక.. తెలుగుదేశంలో ఎవరి అండదండలు అతనికి ఉన్నాయో ఆ సంగతి కూడా తేల్చాలి కదా..? అవేమీ చేయకుండా.. కేవలం అతనితో రాజీ కుదుర్చుకుని.. వెనక్కు టీటీడీకి రాబట్టాం.. అని సుద్దులు మాట్లాడడం ఏ రకంగా కరెక్టు అని పలువురు విశ్లేషిస్తున్నారు.

అందుకే ‘దేవదేవుడి ఖజానానా కాపాడాల్సిన రక్షకులే భక్షకులుగా మారి దోచుకున్న వారితో సెటిల్మెంటు చేసుకున్నారు’ అంటూ భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రవి కుమార్ వ్యవహారంలో సెటిల్మెంట్ జరిగింది 40 కోట్లకా? లేదా, 400 కోట్లకా? చెప్పాలని నిలదీస్తున్నారు. సెక్షన్ 381 కేసులో రాజీకి అవకాశమే లేదని, అలాంటి కేసులో రాజీ ద్వారా న్యాయవ్యవస్థకే భూమన మచ్చ తెచ్చారని కూడా అంటున్నారు. మొత్తానికి భూమన ఇచ్చిన వివరణ ద్వారా.. వారు మరింత లోతుగా ఈ వివాదంలో కూరుకుపోయినట్టుగా కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories