భూబకాసుర ఎమ్మెల్యేల గుట్టు రట్టు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలుగా ఉంటూ అధికారం చెలాయించిన 151 మంది ఎమ్మెల్యేలు, జగన్ పంచన చేరిన మిగిలిన వారు కూడా.. ఒక అతిపెద్ద బహిరంగ దందా నడిపించారు. ప్రతి ఎమ్మెల్యే భూబకాసురుడి అవతారం ఎత్తి సాగించిన దందా అది. పేదలకు ఇళ్లస్థలాల ముసుగులో.. ఒక్కొక్కరూ పదుల కోట్ల రూపాయలు కాజేయడానికి, వారందరూ ఎంతో ప్రేమించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారికి ప్రసాదించిన అద్భుత అవకాశం అది. ఆ భూబకాసుర దందా పర్వం ఇప్పుడు సాధికారికంగా వెలుగులోకి వస్తుంది.

నిజం చెప్పాలంటే.. ఈ దందా ఎవ్వరికీ తెలియనిది కాదు. బహిరంగ రహస్యం అన్నట్టుగానే అప్పట్లో ఎమ్మెల్యేలు ఈ దుర్మార్గపర్వాన్ని నడిపించారు. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి పూనుకున్న ప్రతిచోటా.. కొన్ని నెలలకు ముందే.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో పేదల భూములను తమ బినామీలతో కొంటున్నట్టుగా నామమాత్రపు మొత్తాలు చెల్లించి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఆ తర్వాత.. ఆ భూముల ధరలను మార్కెటు ధరకంటె విపరీతంగా పెంచేశారు. అధికారంలో ఉన్నది వారే గనుక, అక్కడ చక్రం తిప్పి, పెంచిన ధరలకు ప్రభుత్వం కొనేలా ఏర్పాటుచేశారు. రైతులతో ముందుగా మాట్లాడుకున్న మొత్తాలను మాత్రమే వారికి చెల్లించారు. మిగిలినదంతా ఎమ్మెల్యేలు తమ బినామీల ద్వారా కాజేశారు. కొన్ని చోట్ల.. ఈ అగ్రిమెంటు దందా కూడా లేదు. రైతులతో ముందు ధర మాట్లాడడం.. ఆధరను పెంచి ప్రభుత్వానికి వారిద్వారానే విక్రయింపజేయడం.. ఆ వ్యత్యాసం మొత్తాన్ని తాము కమిషన్ రూపంలో కాజేయడం ఒక పెద్ద దందాగా మారింది. ఒక్కొక్క ఎమ్మెల్యే పరిధిలో 20 కోట్లనుంచి 30 కోట్ల వరకు ఈ రూపంలో భూదందాల ద్వారా కాజేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఆ బాగోతం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. అప్పట్లో అందరికీ తెలిసినదే అయినా.. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం వాటిపై దృష్టి సారించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆధారాలు, అగ్రిమెంట్ల సహా సేకరించి.. పక్కాగా కేసులు నమోదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులను ప్రభుత్వం సీరియస్ గా పరిగణించి విచారణ చేయిస్తే.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు, వందల సంఖ్యలో వారి బినామీలు జైళ్లకు వెళ్లవచ్చుననే అభిప్రాయాలు కూడా ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories