టీటీడీ బోర్డులోకి భాను : పోరాటాలకు ఫలితం!

తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిని ప్రకటించిన ఒక రోజు తర్వాత ప్రభుత్వం ఆ జాబితాలో చిన్న మార్పు చేసింది. అదనంగా మరో సభ్యుడిని కూడా నియమించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు దఫాలు బోర్డు సభ్యుడిగా సేవలందించిన బిజెపి నాయకుడు జి. భాను ప్రకాష్ రెడ్డిని మళ్లీ బోర్డులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన బిజెపి నాయకుడు భానుప్రకాష్ రెడ్డి.. తిరుమల తిరుపతి దేవస్థానాల వ్యవహారాలలో సుదీర్ఘకాలంగా పోరాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన రోజల్లో గాడితప్పున వ్యవహారాలను అడ్డుకుంటూ.. వెంకన్న ఆస్తులకు, ఆగమ నియమాల పరిరక్షణకు కాపుకాసినందుకు గుర్తింపుగానే ఈ పదవి దక్కినట్టుగా పలువురు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆ అయిదేళ్లు కాలంలో ఏర్పాటు చేసిన రెండు బోర్డుల్లోనూ భానుప్రకాష్ రెడ్డి బిజెపి తరఫున సభ్యుడిగానే ఉన్నారు. ఆ తర్వాత జగన్ హయాం మొదలైన తర్వాత.. టీటీడీ వ్యవహారాలు గాడితప్పుతుండగా.. వాటికి వ్యతిరేకంగా స్థానికంగానే తన పోరాటపథాన్ని ఎంచుకున్నారు. టీటీడీ నిర్ణయాల్లో ఏ చిన్న లోపం జరిగినా వాటికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. శ్రీవాణి ట్రస్టు ముసుగులో జరిగిన అరాచకాల విషయంలో గానీ, వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా జరగాల్సిన కార్యక్రమాల విషయంలో గానీ.. భక్తులకు అందించే సేవల విషయంలో గానీ.. ఎక్కడ టీటీడీ నిర్లక్ష్యం వహించినా.. వాటిపై భానుప్రకాష్ గళమెత్తేవారు. ఒక దశలో టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి- మాజీ బోర్డు సభ్యుడిగా భానుప్రకాష్ రెడ్డికి మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతి అరాచకాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈవో అనధికారికంగా భానుప్రకాష్ ను బ్లాక్ లిస్టులో పెట్టారు. మాజీ బోర్డు సభ్యుడిగా సిఫారసు ఉత్తరాలు ఇచ్చే అధికారం ఉంటుంది గానీ.. భాను ప్రకాష్ ఉత్తరాలను ఇగ్నోర్ చేసేలా అనధికార ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ప్రోటోకాల్ మర్యాదలు పోయినా భానుప్రకాష్ పట్టించుకోలేదు. టీటీడీ ఆస్తులను, నిధులను ప్రభుత్వానికి మళ్లించే కుట్రలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినప్పుడు ఆ కుట్రలను ముందుగానే పసిగట్టి వాటి గురించి లీక్ చేసి అడ్డుకున్న వ్యక్తిగా భానుప్రకాష్ రెడ్డి జగన్ భక్తులకు మింగుడుపడలేదు.

జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా బోర్డు సభ్యులను పెంచేసి, సలహాదారుల పేరిట పదులసంఖ్యలో ప్రోటోకాల్ ఇస్తూ నియామకాలు చేపట్టినప్పడు వాటికి వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాడి ఆ నిర్ణయాలపై వెనక్కు తగ్గేలా చేశారు. ఇలా టీటీడీ వ్యవహారాలపై పూర్తి పట్టుతో దేవదేవుడికి కాపు కాస్తున్నట్టుగా పోరాడుతూ వచ్చిన  భానుకు మళ్లీ బోర్డు సభ్యత్వం దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే ఈసారి బోర్డు కూర్పులో చంద్రబాబు ఎక్కువగా కొత్తవారికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ క్రమంలో భాను పేరు తొలిజాబితాలో లేదు. అయితే జీవో విడుదల చేసేలోగా దానిని సవరించి.. భానుప్రకాష్ రెడ్డిని కూడా బోర్డు సభ్యుడిగా నియమించడం జరిగింది.

Related Posts

Comments

spot_img

Recent Stories