భళా జేసీ..! అలా రాజీ పడకుండా ఉండాలి!

బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా.. అధికారం ఉన్న పార్టీలో చేరడానికి అవకాశవాదులు పోటెత్తుతుంటారు. అలాంటివారి మాయోపాయాలకు లొంగకుండా, అతి విధేయతలకు పడిపోకుండా.. నాయకులు పార్టీని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు తాడిపత్రి తెలుగుదేశం నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి, పార్టీలో చేరడానికి వచ్చిన ఒక మాజీ నాయకుడి పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. దివాకర్ రెడ్డి స్ఫూర్తిని అధికార కూటమిలోని ఇతర నాయకులు అందిపుచ్చుకోవాలని కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. మాయగాళ్లను దూరం పెట్టాలని అంటున్నారు.

తాడిపత్రిలో శ్రీనివాసులు అనే లాయరు గతంలో తెలుగుదేశంలో ఉండేవాడు. జగన్ అధికారంలోకి వచ్చాక.. ఫిరాయించి వైసిపి పంచన చేరాడు. అక్కడితో ఊరుకున్నా సరిపోయేది. అలా చేయకుండా.. జేసీ బ్రదర్స్ గురించి, ఇతర టిడిపి నాయకుల గురించి తీవ్రమైన భాషలో విమర్శలు చేశాడు. నోరు పారేసుకున్నాడు. తీరా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇలాంటి అవకాశవాదులకు మొహమాటం ఏముంటుంది? ఇవాళ ప్రభాకర్ రెడ్డి వద్దకు వచ్చి చేతులు కట్టుకుని నిల్చున్నాడు.

పొరబాటు అయిపోయిందని సారీ చెప్పాడు. మళ్లీ టీడీపీలో చేరుతానని చెప్పాడు. కానీ జేసీ ఒప్పుకోలేదు. అవసరం లేదు వెళ్ళిపొమ్మని చెప్పారు. ఎంతగా నో చెప్పినా సదరు శ్రీనివాసులు వెళ్ళలేదు. అలాగే చేతులు కట్టుకుని బతిమాలుతూ నిల్చున్నాడు. చివరికి జేసీ మనుషులు ఇద్దరు కలిసి ఆయనను చేతులతో మోసుకువెళ్లి, ఇంటి బయట వదిలేశారు. అలా వదిలించుకోవాల్సి వచ్చింది.

గతంలో పార్టీని వీడి వెళ్లి ఓవర్ యాక్షన్ చేసిన వారి విషయంలో రాష్ట్రంలో ఏ నాయకుడు అయినా సరే ఇలాంటి స్థిర వైఖరి అవలంబించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ఇప్పుడు అధికారం ఉన్నది గనుక మళ్ళీ చేరుతామని వచ్చే వారిని తిప్పి పంపాలని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉన్నట్టుగా సమాచారం. గతంలో పార్టీని విడిపోయిన వారు ఇప్పుడు ఎగబడి వస్తున్నారు. వైసిపి కిందిస్థాయి నాయకులు కూడా టిడిపిలో చేరడానికి మోజుపడుతున్నారు. వీరిని  పార్టీలోకి రానిస్తే, పార్టీనే నమ్ముకుని కష్ట కాలంలోనూ ఉన్న కార్యకర్తలను అవమానించినట్లు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories