అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరగబోతున్నాయి. మౌలిక వసతుల కల్పన పరంగా ఒక అద్భుతమైన ముందడుగు పడినట్టే. కేంద్రం నుంచి 15 వేల కోట్ల రూపాయల సాయం అందుతుండడం అందరికీ తెలిసిందే. సి ఆర్ డి ఏ కు ప్రపంచ బ్యాంకు, ఎడిబి బ్యాంకు కలిపి 13500 కోట్ల రూపాయల రుణాన్ని విడతల వారీగా అందజేయనున్నాయి. ఈ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. రుణంతో రాష్ట్ర ప్రభుత్వానికి గాని, సి ఆర్ డి ఏకి గాని ఎలాంటి సంబంధం లేదు. అయితే 15 వేల కోట్ల రూపాయ లలో మిగిలిన మొత్తాన్ని కేంద్రం సమకూరుస్తుంది. అయితే ప్రపంచ బ్యాంకు నుంచి అందుతున్న నిధులను ఏఏ పనులకు వెచ్చిస్తారు.. ఏ కార్యక్రమాలను చేపడతారు.. అనే విషయంలో సి ఆర్ డి ఏ ఆ బ్యాంకుల ప్రతినిధుల మధ్య ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందానికి సంబంధించి సూచనప్రాయంగా చర్చలు పూర్తయ్యాయి. ఇక ఒప్పందం ముసాయిదాను సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో పెట్టి ఆమోదం తర్వాత అధికారుల సంతకాలు చేస్తారు. ఆ పత్రాలను పంపితే ప్రపంచ బ్యాంకు ఎడిబి బ్యాంకు వారి సమావేశాలలో వాటిని ఆమోదించి వారి ప్రతినిధులు కూడా సంతకాలు చేస్తారు. మొత్తానికి ఈ డిసెంబర్ నెలాఖరులోగా తొలి విడతగా 25శాతం వరకు నిధులు విడుదల కావచ్చునని అంచనా వేస్తున్నారు.
ఈ ప్రపంచ బ్యాంకు నిధులను కేంద్రం అమరావతి కోసం ఇస్తున్న గ్రాంటుగా పరిగణించాలి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ సమావేశాల సమయంలోనే చెప్పారు. రుణం ప్రపంచబ్యాంకు ఇచ్చినప్పటికీ తిరిగి చెల్లించేది కేంద్రమేనని వివిధ సందర్భాలలో ధృవీకరించారు కూడా. ఈ రుణంపై ఐదేళ్లపాటు మారటోరియం ఉంటుంది. అంటే ఐదేళ్లపాటు రుణం తిరిగి చెల్లించే అవసరం లేదు. ఆ తరువాత ఆరు నెలలకు ఒక వాయిదా వంతున ఈఎంఐల రూపంలో రుణం చెల్లిస్తూ పోవాలి. 23 సంవత్సరాలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఈ నిధులను అమరావతి రాజధాని నగర మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తారు. ప్రధానంగా వరద విపత్తు నగరాన్ని ముంచెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు, నీటి వనరుల నిర్వహణ, రిజర్వాయర్ల పరిరక్షణ, మౌలిక వసతులు, అవసరమైన రోడ్లు, ట్రంకు రోడ్ల నిర్మాణం, పార్కులు తదితరమైనవి ప్రజోపయోగకరమైన భవనాలు ఇలాంటివి నిధుల ద్వారా చేపడతారు. మొత్తానికి డిసెంబర్ నెల ఆఖరులోగా నిధులు రావడం మొదలవుతుంది. అదే సమయానికి అనేక పనులకు టెండర్లు పిలవడం కూడా పూర్తవుతుంది.
ఇంచుమించుగా జనవరి నుంచి అమరావతిలో మౌలిక వసతులు కల్పనకు సంబంధించిన పనులు శరవేగంగా మొదలవుతాయని చెప్పవచ్చు. మూడు నాలుగు ఇళ్లలోగా ఈ 15000 కోట్ల నిధులతో సమస్త సదుపాయాల కల్పన పూర్తిఅవుతుంది. వీటికి సమాంతరంగా వివిధ భవనాలు, ఐకానిక్ భవనాలకు నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతాయి. వీటితోపాటు ప్రైవేటు భవనాలు కేంద్ర ప్రభుత్వానికి వివిధ యూనివర్సిటీలకు కేటాయించిన స్థలాలలో వారు నిర్మించే భవనాలు ఇవన్నీ శరవేగంగా జరిగే అవకాశం ఉంది. మొత్తానికి రాబోయే నాలుగేళ్లలో అమరావతి రూపురేఖలు గొప్పగా మారుతాయి అని అందరూ అంచనా వేస్తున్నారు.