‘151కి పైగా ఎమ్మెల్యే సీట్లలో విజయం సాధిస్తాం’ అని జగన్మోహన్ రెడ్డి చాలా ఆర్భాటంగా ప్రకటించి ఉండవచ్చు గాక! ఆ మాటలను ప్రత్యక్షంగా విన్నటువంటి ఐపాక్ ప్రతినిధులు అదంతా తమ ఘనతకు సంబంధించిన ప్రశంస మాత్రమే అనే ఉద్దేశంతో బీభత్సంగా కరతాళ ధ్వనులు చేసి ఆనందించి ఉండవచ్చు గాక! రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళాలు తమ నాయకుడి మాటలను వుటంకిస్తూ తెలుగుదేశానికి ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అనే వాదనలతో చెలరేగిపోతూ ఉండవచ్చు గాక! ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను కనీసం ఆ పార్టీ వాళ్ళు అయినా సరే వాస్తవంగా ఎంత మంది నమ్ముతున్నారు అనేది ముఖ్యం! ఈ సంగతి తెలుసుకోవడానికి ఒకే ఒక్క లిట్మస్ టెస్ట్ ఉంది. జగన్ మాటలు కనీసం ఆయన పార్టీ వాళ్లు కూడా నిజంగా నమ్మించలేకపోయాయి అనే సంగతి ఆ లిట్మస్ టెస్ట్ లో బయటపడుతున్నది.
మీకు పరిచయం ఉన్న, లేదా మీతో వాదులాటకు దిగే అలవాటు ఉన్న ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అయినా ఒకే ఒక్క ప్రశ్న అడగండి- జగన్ పార్టీకి 151 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి రావు అనే సింగిల్ పాయింట్ మీద బెట్టింగ్ వేసుకుందాం అని చెప్పండి! ఆ బెట్టింగ్ కు అవతలి వాళ్ళు సిద్ధపడితే జగన్ మాటలను నమ్ముతున్నట్లు లెక్క! అలా కాకుండా బెట్టింగ్ మరో రకంగా వేసుకుందాం అని అన్నారంటే వారికి జగన్ మాటల మీద నమ్మకం లేదని లెక్క!!
వందల వేల కోట్ల రూపాయలకు చేరుతున్న రాష్ట్రంలోని బెట్టింగ్ వ్యవహారంలో ఈ అంశం ఒక కీలకంగా చర్చకు నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. జగన్ మాటలను నమ్మే వాళ్ళు ఉంటే 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని పాయింట్ మీద బెట్టింగ్ వేసుకోవాలనే సవాళ్లు ముదురుతున్నాయి. ఆ సవాళ్లను స్వీకరించే వారే కనిపించడం లేదు. ప్రస్తుతం తెలుగుదేశం కనీసం 100 స్థానాలకు కొంచెం అటు ఇటుగా గెలిచి అధికారంలోకి వస్తుందని బెట్టింగ్ కాస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ వీరాభిమానులు, జగన్ మీద అపరిమితమైన అభిమానం ఉన్నవాళ్లు ఆ పార్టీ గెలుస్తుందని కూడా పందేలు కడుతున్నారు. కానీ జగన్ చెబుతున్నట్లుగా 151 ప్లస్ లేదా అత్యంత భారీ మెజారిటీలు లాంటి సవాళ్లకు వెళ్లడం లేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైనదంటే క్షేత్రస్థాయి బెట్టింగ్ వ్యవహారమే రాష్ట్రస్థాయి ఎన్నికల ఫలితాలకు ప్రజల అంచనాగా ప్రదర్శితమవుతోంది. ఈ కొలబద్ధ మీద చూసినప్పుడు జగన్ సర్కారు పతనం తథ్యం అని పలువురు అంచనా వేస్తున్నారు.