తిరుమల వేంకటేశ్వర స్వామి అంటే.. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తుల్లో మాత్రమే కాదు. అన్యమతాలకు చెందిన ఉదారవాదుల్లో కూడా అనన్యమైన భక్తి ప్రపత్తులు ఉంటాయి. ప్రతిరోజూ దాదాపు లక్షమంది భక్తులు తిరుమలేశుడిని సేవించుకుంటూ ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తులు దైవదర్శనం తరువాత.. అంతే పవిత్రంగా భావించేది శ్రీవారి లడ్డూ ప్రసాదాన్నే! రకరకాల కారణాల వల్ల దర్శనభాగ్యం దొరక్కపోయినా సరే.. లడ్డూ ప్రసాదమే స్వామిని సేవించుకున్నంత పవిత్రమైనదిగా భావిస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదం మీద యావత్ ప్రపంచంలోని భక్తకోటిలో ఏహ్యభావం పుట్టేలాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ సర్కారు నీచత్వానికి ఒడిగట్టిన వైనం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానాల పదవి అంటే చాలు.. దేవుడి సొమ్మును దోచుకు తినడానికి దుర్మార్గులు దానిని ఒక స్వర్గధామంగా, గొప్పమార్గంగా భావిస్తుంటారు. వైసీపీ నాయకులు కూడా అదే పనిచేశారు. కాంట్రాక్టులు, ఇతరత్రా దందాలు, నిర్మాణాల పనులు, ఊరూరా గుడులు కడతాం అనే వ్యాపార రహస్యాలు తదితర దారుల్లో దోచుకోవడం అంతా ఒక ఎత్తు. చివరికి స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో కూడా నాణ్యతను భ్రష్టు పట్టించి దోచుకోవడం ఒక్కటీ మరో ఎత్తు.
లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో కూడా అక్రమార్జనల దందాలు సాగించాలనుకోవడం వైపీపీ నాయకుల పతనానికి నీచత్వానికి పరాకాష్ట. అప్పట్లో వాడిని నెయ్యిని నాణ్యత పరీక్షలకు పంపిస్తే అనేక విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఆ నెయ్యిలో పందికొవ్వు, గొడ్డు కొవ్వు, చేపనూనె వంటివి కలగలిసి ఉండవచ్చుననే అనుమానాలను గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ వ్యక్తం చేయడం విశేషం. ఆ నెయ్యిలో పాలకు సంబంధించినవి కాకుండా.. ఇతర కొవ్వులు కలిసినట్టుగా ఆ సంస్థ ధ్రువీకరించిన సంగతిని తెలుగుదేశం ఇప్పుడు ఆరోపిస్తోంది. దీంతో వైసీసీ జమానాలో తిరుమలేశునికి జరిగిన ద్రోహం ప్రజలకు తెలిసివస్తోంది.
జగన్ హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం, అన్యమతాలను ఆచరించే వారిని తిరుమల తిరుపతి దేవస్థానాల కీలక పదవులలో నియమించడం వంటి దారుణాలు మాత్రమే కాదు.. స్వామివారి లడ్డూను భక్తులు ఏవగించుకునేంత అధ్వానంగా మార్చేయడం కూడా వారి పాపాల్లో ఒకటిగా బయటకు వస్తోంది.