ఆయన ఇన్నాళ్లపాటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులతో అన్ని రకాలుగానూ అంటకాగారు. వారి దందాలలో తాను కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. ఎన్నెన్ని రకాల దందాలు చేయవచ్చునో తానే స్వయంగా సలహాలు ఇచ్చారు. వాటిని ఆచరణలో పెట్టడంలోకూడా తనే కీలక పాత్ర పోషించారు. నెల పెడితే చాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు వేల కోట్ల రూపాయలు దండుకోవడానికి దందా సాగించడానికి వీలుగా వ్యవస్థలను దారిమళ్లించి.. వారికి ఉపయోగపడుతూ వచ్చారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. జగన్ అరాచకాలను భరించలేక ప్రజలు ఆయన పార్టీని తీవ్రంగా ఛీత్కరించిన తరువాత.. ఆయనకు కళ్లముందు పొరలు తొలగిపోయాయి. తన కార్యాలయం నుంచి ముఖ్యమైన కంప్యూటరు హార్డ్ డిస్కులు, అనేక ఫైళ్లను కారులో తరలించుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఆయన పాపం పండబోతోంది. ఆయన అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఆయన మరెవ్వరో కాదు.. ఆంద్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ, ఐఆర్టిఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి! ఫైళ్లను, హార్డ్ డిస్కులను తరలించినట్టుగా వచ్చిన ఫిర్యాదును అనుసరించి ఆయన మీద కేసులు నమోదు చేసి, ఇంట్లో సోదాలు కూడా నిర్వహించిన సీఐడీ పోలీసులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకటిరెండు రోజుల్లో ఆయన అరెస్టు కూడా ఉంటుందని అంటున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయడానికంటె ముందే.. వాసుదేవరెడ్డి అరెస్టు జరుగుతుందని అంటున్నారు.
బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి మద్యం విధానంలో ఎన్ని రకాలుగా దోచుకోవచ్చునో.. జగన్ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ.. ఆ వ్యవహారాలు అన్నింటినీ తాను స్వయంగా నడిపించిన వ్యక్తి. రాష్ట్రంలో బ్రూవరీస్, బెవరేజెస్ వ్యాపారంలో ఉన్న పలువురిని బెదిరించి వారి కంపెనీలను వైసీపీ బినామీలకు అమ్మేసేలా వారి మీద ఒత్తిడి తెచ్చినది కూడా వాసుదేవరెడ్డే అనే ఆరోపణలున్నాయి. ఆ రకంగా మద్యం తయారీ రంగాన్ని వైసీపీ నేతల పూర్తిగా హస్తగతం చేసుకున్నారు. ఆ తర్వాత అత్యంత నాసిరకం మద్యం తయారు చేయడాన్ని ప్రారంభించారు. ఆ మద్యం తప్ప ఇతర బ్రాండ్లు ఏపీలో అమ్మడానికే వీల్లేదంటూ జగన్ ఏకంగా చట్టం తెచ్చారు. దాంతో సొమ్ము, ఒళ్లు రెండూ గుల్లవుతున్నప్పటికీ.. వ్యసనానికి లోబడిన వారు జగన్ ను తిట్టుకుంటూ అదే మద్యం తాగడం అలవాటు చేసుకున్నారు.
ఏడాదికి యాభైవేల కోట్ల రూపాయలకు పైగా జగన్ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ద్వారా దోచుకుంటున్నట్టుగా బిజెపి అధ్యక్షరాలు పురందేశ్వరి కూడా పలుమార్లు ఆరోపించారు. కేవలం నగదు చెల్లింపుల ద్వారా మాత్రమే మద్యం విక్రయిస్తూ సాగించిన దందా కూడా ఇంకొకటి. ఇలా అనేక రూపాల్లో జగన్ మరియు కీలక వైసీపీ నాయకులు మద్యం వ్యాపారంలో దోచుకోవడానికి.. వాసుదేవరెడ్డి చాలా ఉపయోగపడ్డారనే అభియోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పాపం పండి.. కేసు నమోదు అయింది. రెండు రోజుల్లో అరెస్టు కూడా జరుగుతుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.