అభ్యర్థిని ప్రకటించకముందే గట్టిపడుతున్న కూటమి!

ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఈ నెలలో ఎన్నిక జరగబోతోంది. అయితే శాసనసభ ఎన్నికల తర్వాత.. మండలిలో కూడా తమ బలం పెంచుకునే దిశగా వ్యూహరచన చేస్తున్న ఎన్డీయే కూటమి.. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల విషయంలో తమ బలాన్ని అనూహ్యంగా పెంచుకుంటోంది. నిన్నటిదాకా అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రతినిధులు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా విశాఖ నగర కార్పొరేషన్ పరిధిలోని అయిదుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరడం విశేషం.

ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కు 625 ఓట్ల దాకా బలం ఉంది. సాధారణంగా అయితే వారే గెలవాలి. కానీ.. శాసనసభ ఎన్నికల తర్వాత.. ఆ పార్టీ రాష్ట్రంలో బతికి బట్టకట్టడం అసాధ్యం అని నమ్ముతున్న వారంతా కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వారంతా బేషరతుగా అధికార కూటమిలో చేరుతుండడం విశేషం. ఇప్పుడున్న పదవులు, తమ  పరిధిలో అభివృద్ధి చాలుననే ఉద్దేశంతోనే వారంతా చేరుతున్నారు. విశాఖకు చెందిన కార్పొరేటర్లు పలువురు ఇటీవల తెలుగుదేశంలో చేరిన సంగతి గుర్తుండే ఉంటుంది. అసలు కార్పొరేషన్ పరిధిలో ఒక్క కార్పొరేటర్ కూడా పక్కచూపులు చూడకుండా మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ తదితరులు వరుస సమావేశాలు పెడుతూ చర్చలు జరుపుతున్నప్పటికీ కూడా పెద్దసంఖ్యలో వారు అధికార కూటమిలోకి వెళుతున్నారు.

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి గా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించింది. ఎన్డీయే కూటమి ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. కసరత్తు జరుగుతోంది. జనసేన ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ వియ్యంకుడు, తెలుగుదేశం నాయకుడు అయిన వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. తొలుత గండి బాబ్జీ పేరు కూడా పరిశీలనకు వచ్చింది. కూటమి ఇంకా తమ అభ్యర్థి ఎవరో నిర్ణయించుకోకముందే.. ఆ పరిధిలో కూటమి పార్టీలు బలపడుతూ ఉండడం గమనార్హం. మిగిలిన మునిసిపాలిటీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో కూడా పలువురు కూటమి పార్టీలతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories