ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచితంగా సరఫరా కావడానికి ఉద్దేశించిన బియ్యం వేల మెట్రిక్ టన్నులు విదేశాలకు స్మగ్లింగ్ అవుతున్న వైనం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కాకినాడ కేంద్రంగా పేదలకు అందవలసిన బియ్యం విదేశాలకు స్మగ్లింగ్ అవుతున్నదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తెరవెనుక ఉండి ఈ స్మగ్లింగ్ దందాను నడిపిస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు నుంచే పలుమార్లు వెల్లడిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ స్మగ్లింగ్ దందాను సముద్రంలో సినిమా ఫకీలో ఒక చేజ్ నిర్వహించి మరీ కలెక్టర్ పట్టుకున్నారు. ఆ తర్వాత అక్కడకు పరిశీలనకు వెళ్లిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోర్టు అధికారుల నుంచి తనకు ఎదురైన సహాయ నిరాకరణ, వారి బుకాయింపు మాటలు తదితర వ్యవహారాలు అన్నింటిని ప్రెస్ మీట్ లో విపులంగా ప్రజల ముందు ఉంచారు. ఇక్కడి వరకు ఒక ఎపిసోడ్ అయితే.. పట్టుబడిన పిడిఎస్ బియ్యం గురించి, పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అతిశయంగా స్పందిస్తున్న తీరు చిత్రంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం సీజ్ చేసిన పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్న నౌకలోకి ఎలా చేరాయి? రెండు నెలల నుంచి పవన్ కళ్యాణ్ తను పోర్టును సందర్శించాలని అనుకుంటూ ఉంటే అడ్డుపడుతున్న అధికారులు ఎవరు? ఇది ప్రభుత్వ వైఫల్యమే కదా ప్రభుత్వంలోని వారే ఈ స్మగ్లింగుకు సహకరిస్తున్నట్లు కదా? అని అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు వంటి మాజీ మంత్రులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిజానికి పిడిఎస్ బియ్యం అక్రమంగా తరలిపోతూ పట్టుబడితే ఆ వ్యవహారాన్ని తెలుగుదేశం సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే అంటగట్టి రాజకీయ లబ్ధి పొందడానికి వారు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
అయితే విశ్లేషకులు చెబుతున్న మాటలను బట్టి ఈ పిడిఎస్ బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించదలుచుకుంటే ఆచితూచి మాట్లాడాలని అంటున్నారు. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో ఎలాంటి విషయాలనైనా మాట్లాడి ఉండవచ్చు. కానీ, విచారణ మొదలై పోలీసులు ఈ కేసును తవ్వడం ప్రారంభిస్తే కనుక అంతా వైసిపి పెద్ద తలకాయలే బయటకు వస్తాయని అప్పుడు మొహం చెల్లకుండా పోతుందని వారు అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలోనే బియ్యం స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా.. ఆయన కేవలం బియ్యం స్మగ్లింగ్ ద్వారా మాత్రమే వార్తల లోకి వచ్చినట్టుగా చాలా కాలంగా ప్రచారం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సందర్శించిన పోర్టు ద్వారా వ్యాపారాల ముసుగులో స్మగ్లింగ్ చేస్తున్న సంస్థలలో ఒకటి సదరు చంద్రశేఖరరెడ్డి తమ్ముడిదే అనే ప్రచారం కూడా వినిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముందుచూపు లేకుండా ఈ విషయంలో అతిగా మాట్లాడితే కొంచెం విచారణ సాగిన తర్వాత బయటకు వచ్చేదంతా ఆ పార్టీ నాయకుల పేర్లే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎక్స్ ట్రాలు మాట్లాడితే రేపు తమ పార్టీ నేతల పేర్లే బయటకు వచ్చిన తర్వాత మరింతగా పరువు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.