ఇప్పుడు అగ్రి గోల్డ్ భూముల కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారంలో ఉంటే తప్పుడు వ్యక్తులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించగలరో, ఎన్ని రకాలుగా అడ్డదారులు తొక్కగలరో ఎంత విచ్చలవిడిగా కబ్జా పర్వాలకు పాల్పడగలరో తెలుసుకోవడానికి జోగి రమేష్ మరియు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఒక మంచి ఉదాహరణ. వివాదాస్పదమైన అగ్రిగోల్డ్ భూములను కొని, కబ్జాచేసి, తమ ఆధీనంలో ఉంచుకుని.. గుట్టు చప్పుడు కాకుండా వాటి సర్వే నెంబర్లను కూడా మార్చేసి.. ఆ తర్వాత వాటిని విక్రయించేసిన ఘనత జోగి రమేష్ ది. దానికి సంబంధించి ప్రస్తుతానికి జోగి రమేష్ కొడుకు రాజీవ్ అరెస్టు అయ్యాడు. నా కొడుకు అమాయకుడు, కక్షపూరితంగా కేసులుపెట్టారు.. అని జోగి రమేష్ ఆవేదన చెందుతున్నారు.
కొడుకు అమాయకుడే అయిఉండొచ్చు గాక.. పాపం.. అలాంటి అమాయకుడి పేరు మీద తాను కబ్జా చేసిన, అక్రమాలకు పాల్పడిన ఆస్తులను పెట్టినప్పుడే.. ఆ కుమారుడిని తాను బలిపశువును చేస్తున్నానని జోగి రమేష్ కు ఒక అంచనా ఉండి ఉండాలి. అప్పుడు అధికారం తమ చేతిలో ఉన్నదని చెలరేగిపోయారు. ఇప్పుడు తండ్రుల పాపాలు పండి, కొడుకుల మెడకు కూడా చుట్టుకుంటున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. చెలరేగిపోయిన నాయకుల విషయంలో ఇలాంటి ‘బాప్ ఔర్ బేటా’ ప్యాకేజీ ఆఫర్ ఇంకా చాలా మంది నాయకులకు తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తండ్రుల దురాశ, అక్రమాలు, తప్పుడు పనుల ఫలితం.. అప్పట్లో ఆ పనులకు సహకరించిన, ఆ అరాచకాల్లో భాగంగా ఉన్న కొడుకులు కూడా అనుభవించే రోజులు వచ్చాయని అంటున్నారు.
వైసీపీ పెద్ద నేతల్లో సజ్జల రామక్రిష్ణారెడ్డి- భార్గవ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి- మోహిత్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి- అభినయ్ రెడ్డి తదితరుల తరహాలో తండ్రీ కొడుకులు ఇద్దరూ ప్యాకేజీ శిక్షలు అనుభవించవలసి వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని.. అందరి పాపాలు లెక్క తేలుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.