తన అడ్డాలో పైచేయి చూపించిన బాలయ్య

రాష్ట్రవ్యాప్తంగా పలు మునిసిపాలిటీల్లో, కార్పొరేషన్లలో ఛైర్మన్, డిప్యూటీ మేయర్ వంటి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రోజురోజుకూ దిగనాసిల్లుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాభవానికి చిహ్నంగా దాదాపుగా అన్ని ఎన్నికల్లోనూ అధికార తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన హవా చూపించారు. హిందూపురం మునిసిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంది. మిగిలిన అనేక చోట్ల డిప్యూటీ ఛైర్మన్, డిప్యూటీ మేయర్ స్థానాలు తెలుగుదేశం పరమయ్యాయి. తిరుపతిలో సభ్యుల గైర్హాజరు వల్ల అసలు ఎన్నికల జరగనేలేదు.

హిందూపురం మునిసిపాలిటీలో మొత్తం 40 మంది కౌన్సిలర్లున్నారు. ఛైర్మన్ గా ఆరోవార్డు కౌన్సిలర్ రమేశ్ గెలిచారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీ పార్థసారధి కూడా ఓటింగులో పాల్గొన్నారు. తెలుగుదేశం అభ్యర్థికి 23 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి లక్ష్మికి 14 ఓట్లే వచ్చాయి. ముగ్గురు అసలు ఓటింగుకే రాలేదు. హిందూపురం మునిసిపాలిటీలో చాలాకాలం నుంచి రాజకీయ గేమ్ నడుస్తూ ఉంది. కౌన్సిలర్లు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తరవాత వైసీపీ నాయకులు వారిని బలవంతంగా కొన్నాళ్లు ఆపగలిగారు. అయితే ఎంతో కాలం అలా ఆపలేరని తాజాగా  నిరూపణ అయింది.

ఏలూరు రెండు డిప్యూటీ మేయరు స్థానాలను తెలుగుదేశం ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఉమామహేశ్వరరావు, దుర్గాభవాని ఎన్నికయ్యారు.
నెల్లూరు డిప్యూటీ మేయరుగా తెదేపా మద్దతు ఇచ్చిన తహసీన్ గెలిచారు. ఆమెకు ఏకంగా 41 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కరీముల్లాకు కేవలం 12 ఓట్లే వచ్చాయి. నెల్లూరుజిల్లాలోనే బుచ్చిరెడ్డి పాలెం మునిసిపాలిటీలో వైస్ ఛైర్మన్లుగా తెలుగుదేశానికి చెందిన వారు ఎన్నికయ్యారు.

తమాషా ఏంటంటే.. ఖచ్చితంగా ఓడిపోతాం అనే భయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కొన్ని చోట్ల కుటిల నాటకాలు నడిపిస్తున్నారు. అసలు వారు సమావేశానికే హాజరు కావడం లేదు. దీంతో కోరం లేకపోవడం వల్ల ఎన్నికను వాయిదా వేయాల్సి వస్తోంది. తిరుపతి, పిడుగురాళ్ల, నందిగామల్లో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసలు ఎన్నిక జరగడానికంటె ముందే.. వైఎస్సార్ సీపీ నాయకులు ఓటమికి మానసికంగా సిద్ధపడిపోతున్నారని దీనిని బట్టి అర్థమవుతోంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories