వై శ్రీలక్ష్మి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత సీనియర్ అయిన ఐఏఎస్ అధికారి. సీనియారిటీలో టాప్ పొజిషన్ లో ఉన్న నీరభ్ కుమార ప్రసాద్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన తర్వాత టాప్ లో ఉన్నది శ్రీ లక్ష్మీ మాత్రమే. అంటే నీరభ్ కుమార్ ప్రసాద్ తర్వాత ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావాలి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలలో భాగం పంచుకున్న వ్యవహారాలు ఆమెని ఇంకా వెన్నాడుతున్నాయి. అందుకే చీఫ్ సెక్రటరీ హోదా దక్కబోవడం లేదు. మరొక అధికారిని ఎంపిక చేయడానికి చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనుండటంతో కొత్త సంవత్సరంలో ఏపీకి కొత్త సిఎస్ వచ్చే అవకాశం ఉంది.
వై శ్రీలక్ష్మి చాలా ప్రతిభావంతురాలిగా, తన చిన్నతనం నుంచీ ఇంటెలిజెంట్ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే ఆమె ఐఏఎస్ సాధించారు అప్పట్లోనే ప్రతి ఒక్కరూ కూడా ఆమె ఏదో ఒకనాటికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పకుండా అవుతుందని ఆ పదవిలో సుదీర్ఘకాలం కొనసాగుతుందని కూడా అంచనా వేశారు. అలాంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కానీ ఆమె కెరియర్ మీద ఉన్న అవినీతి మరకలు సి ఎస్ కానివ్వకుండా అడ్డుపడుతున్నాయి. శ్రీలక్ష్మిని సీఎస్ గా ఎంపిక చేయడానికి చంద్రబాబునాయుడు అంగీకరించడంలేదు.
ఐఏఎస్ అధికారిగా కీలక పదవుల్లోకి వచ్చిన నాటి నుంచి శ్రీలక్ష్మి అవినీతి దందాలను ప్రారంభించిన చరిత్ర ఉంది. విశాఖపట్నంలో ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే పలు ఆరోపణలు వచ్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కాలంలో, జగన్మోహన్ రెడ్డి సాగించిన దందాలకు అప్పటి గనుల శాఖ వ్యవహారాలు చూసిన శ్రీలక్ష్మి అన్ని రకాలుగానూ అడ్డదారుల్లో సహకరించారు. ఆ మేరకు ఆమె కూడా అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. ఆ తర్వాత విచారణలు సాగినప్పుడు ఆమె అవినీతి బాగోతాలన్నీ బయటకు వచ్చాయి. వై శ్రీలక్ష్మి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
రాష్ట్ర విభజన తర్వాత.. జగన్ సీఎం అయ్యాక తెలంగాణ నుంచి ఏపీ సర్వీసులకు వచ్చిన శ్రీలక్ష్మికి మళ్లీ జగన్ పెద్దపీట వేశారు. ఆయన హయాంలో ఆమె చక్రం తిప్పుతూ వచ్చారు. మళ్లీ జగన్ సీఎం అయి ఉంటే.. ఆమె ఖచ్చితంగా సీఎస్ అయి ఉండేవారు. కానీ.. ఇప్పుడు పాతపాపాలు ఆమెకు అడ్డుపడ్డాయని ప్రజలు అనుకుంటున్నారు.