దివ్యాంగులకు బాబుసర్కారు అత్యంత తీపికబురు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో మూడువేలు మాత్రమే ఉన్న వికలాంగ పెన్షనును రెట్టింపు చేసి ఆరువేలరూపాయలు ఇస్తాం అంటూ చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందే హామీ ఇచ్చి.. అధికారంలోకి రాగానే ఆ మాట నిలబెట్టుకున్నారు. ఆ వికలాంగులకు ఇప్పుడు మరోమారు అంతకంటె తీపికబురు ప్రకటించారు. ఎలాంటి న్యాయపరమైన ఇక్కట్లు రాకుండా ఉండేందుకు అంగవైకల్యంపై రీవెరిఫికేషన్ నిర్వహించిన నేపథ్యంలో..  అనర్హులుగా భావిస్తూ కొందరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే.. ఇప్పుడు తాజాగా, ఈ నోటీసులతో సంబంధం లేకుండా.. ఆగస్టు నెలలో పింఛను తీసుకున్న వికలాంగులు అందరికీ సెప్టెంబరు నెలలో కూడా పింఛను ఇవ్వాల్సిందే అంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది నిజంగానే.. రాష్ట్రంలోని వికలాంగులకు చంద్రబాబునాయుడు ప్రకటించిన రెండో తీపికబురు అని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా.. వికలాంగులను అడ్డుపెట్టుకుని రాజకీయ మైలేజీ సాధించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని రోజులుగా సాగించిన కుటిల పన్నాగాలకు సర్కారు చెక్ పెట్టినట్టు అయింది.

రాష్ట్రంలో మొత్తం ఏడున్నర లక్షల మంది వికలాంగ పెన్షను లబ్ధిదారులు ఉన్నారు. వీరి పెన్షన్ల విషయంలో ఎలాంటి లీగల్ చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం వారి వైకల్య ధ్రువీకరణకు రీవెరిఫికేషన్ కు ఆదేశించింది. 40 శాతం వైకల్యం ఉన్నట్టుగా డాక్టరు సర్టిఫికెట్ ఉంటేనే పెన్షను అందేలా నిబంధన విధించారు. అలాంటి సర్టిఫికెట్లు చూపించలేకపోయిన 1.35 లక్షలమందికి పెన్షను ఎందుకు తొలగించకూడదో తెలియజేయాలని ప్రభుత్వం నోటీసులు పంపింది.

అదే సమయంలో.. ఈ అనర్హుల జాబితాలో తేడాలు రావొచ్చనే ఉద్దేశంతో.. అర్హులు ఉంటే వారు అప్పీలు చేసుకోవచ్చుననే వెసులుబాటు కూడా కల్పించింది. ఒకవైపు వారు అప్పీలు చేసుకోవడం జరుగుతూ ఉండగానే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగప్రవేశం చేసింది. నోటీసులు ఇవ్వడాన్నే బూచిలాచూపిస్తూ.. అక్కడితోనే పెన్షన్లు తొలగించేసినట్టుగా భ్రమింపజేస్తూ ప్రభుత్వం మీద బురద చల్లుతూ విషప్రచారం ప్రారంభించింది. నోటీసులు అందుకున్న వారిలో భయాన్ని రేకెత్తించి.. వారు రోడ్డు  మీదకు వచ్చే దుర్మార్గమైన పరిస్థితి కల్పించింది. అయితే.. అనర్హుల జాబితాలోని వారిలో దాదాపుగా 95 శాతం మంది తమ అర్హతను క్లెయిం చేసుకుంటూ అప్పీలు చేసుకున్నారు. అంత పెద్ద మొత్తంలో అప్పీళ్లు రావడంతో.. మొత్తం అందరికీ కూడా వికలాంగ పెన్షన్లు ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఆగస్టునెలలో పుచ్చుకున్న అందరికీ కూడా సెప్టెంబరు నెలలో ఇచ్చేయాలని ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతానికి ఇంకా రెండు లక్షల మంది విషయంలో ఇంకా వెరిఫికేషన్ బాకీ ఉండగా.. దానిని పూర్తిచేయాలా వద్దా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ రకంగా.. వికలాంగులకు తీపికబురు చెప్పడం మాత్రమే కాదు, వైసీపీ దుష్ప్రచారాలకు కూడా ప్రభుత్వం అడ్డుకట్ట వేసినట్టయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories