బాబు టార్గెట్.. అక్కడకూడా అధికారం లోకి!

చంద్రబాబునాయుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీకి తిరిగి జవసత్వాలు తీసుకు వచ్చే బృహత్ ప్రక్రియను ప్రారంభించారు. ఇతర పార్టీల నుంచి కీలక నాయకులు అందరినీ ఫిరాయింపజేసి తమలో కలుపుకోవడం ద్వారా.. బలంగా కనిపించిన భారత రాష్ట్ర సమితి ప్రాభవం నీటిబుడగలాగా పేలిపోయిన తర్వాత.. తెలంగాణ తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించడానికి ఇది సరైన సమయం అని చంద్రబాబునాయుడు ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పర్వం పూర్తయిన తర్వాత.. పార్టీ కమిటీలు కూడా ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా అడుగులు వేయబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. తద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.

తెలంగాణలో తెలుగుదేశానికి కార్యకర్తల్లో, ప్రజల్లో ఒక స్థాయి బలం ఉంది. కాస్త గెలిచే నమ్మకం ఉన్న అభ్యర్థిని మోహరిస్తే ఓట్లు వేసే అభిమానులు పార్టీకి తప్పకుండా ఉన్నారు. కానీ.. రకరకాల కారణాల వల్ల పార్టీ తెలంగాణలో నీరసించి పోయింది. ఇప్పుడు పార్టీ పునర్నిర్మాణానికి చంద్రబాబు నడుం బిగించడం పట్ల కార్యకర్తల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

నిజం చెప్పాలంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి ఇప్పుడు సానుకూల అంశాలు ఉన్నాయి. తెలుగుదేశం ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎంతగా బలపడిపోయాం అని సొంత డప్పు కొట్టుకున్నప్పటికీ.. వారి వాస్తవ బలం ఏమిటో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. కాబట్టి.. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలే అదే ఐక్యతతో తెలంగాణలో కూడా రాజకీయం చేయడం వారికే మేలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అనుకోవడం భ్రమ. కావలిస్తే వారు మెజారిటీ సీట్లు తమ చేతిలో పెట్టుకుని, తెలుగుదేశం, జనసేనలను కూడా కలుపుకోవచ్చు. అప్పుడు మూడు పార్టీలు ఐక్యంగా గెలుపుబాటలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా తెలంగాణలో తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలో తేవాలనే చంద్రబాబు కోరిక సఫలం అవుతుందని కూడా పలువురు ఆశిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories