బీసీలు తమకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ కావాలని కోరుతుంటారు. సాధారణంగా ప్రాక్టికాలిటీ గురించి ఆలోచించని, కేవలం తాము బీసీల కోసం పోరాడుతున్నాం అని ప్రచారం చేసుకోవడం మీద మాత్రమే ధ్యాస ఉండే నాయకులే ఇలాంటి ఆచరణ సాధ్యం కాని కోరికలతో రెచ్చిపోతుంటారు. బీసీలను ఉద్దరిస్తున్టన్టుగా కలర్ ఇస్తూ ఎవరు ఏమైనా అడుగుతుండవచ్చు గానీ.. నిజంగా బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉండే నాయకుడిగా.. చంద్రబాబునాయుడు వారికి చట్టబద్ధమైన వాటాను పెంచుతూ నిర్ణయం తీసుకోబోతున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించే అంశాన్ని బుధవారం జరిగే కేబినెట్ భేటీలో ఆమోదించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే.. బీసీలకు అది చాలా పెద్ద వరం అవుతుంది.
రాజకీయ అధికారం గురించి బీసీల్లో చాలా చాలా డిమాండ్లు ఉంటున్నాయి. వారు ఎప్పుడూ యాభైశాతం చట్టసభల్లో రిజర్వేషన్ డిమాండ్ చేస్తుంటారు. కానీ.. అది ఆచరణకు దూరంగానే మిగిలిపోతుంటుంది. నిజం చెప్పాలంటే.. పార్టీలు కూడా యాభైశాతం బీసీలకు టికెట్లు కేటాయించడం అనేది ఎన్నడూ జరగదు. అందునకు రకరకాల కారణాలుంటాయి. ఆర్థిక, సామాజిక నేపథ్యాలను బట్టి వీలు పడదనేది పలువురి అభిప్రాయం.
కానీ చట్టసభల పదవులతో సమానమైన నామినేటెడ్ పోస్టుల్లో.. బీసీలకు చట్టబద్ధమైన వాటా పెట్టడానికి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేసి, దాని స్థానంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేలా కొత్త చట్టం తీసుకురాబోతున్నారు.
బుధవారం కేబినెట్ భేటీ జరగబోతోంది. 11వ తేదీనుంచి శాసనసభ సమావేశాలు జురగబోతున్న నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీ కీలకం కానుంది.
అలాగే.. రాష్ట్రంలోని ప్రజలకు అతిపెద్ద సమస్యగా మారిన, మారుతున్న భూవివాదాలకు కూడా శాశ్వత పరిష్కారం చూపే దశగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం 1982 నాటి భూసేకరణ చట్టం కూడా రద్దు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వానికి వస్తున్న ప్రజల ఫిర్యాదుల్లో 80 శాతం భూసేకరణకు సంబంధించిన ఫిర్యాదులే కావడంతో.. వీటికి ఒక శాశ్వత పరిష్కారం చూడాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది.
ఈ చట్టంతో పాటు.. బీసీలకు నామినేటెడ్ పదవుల్లో నిర్దిష్టమైన వాటా కేటాయించడం వల్ల.. అవకాశం వచ్చినా సరే.. చట్టసభలకు ఎంపిక కాలేని స్థితిలో ఉండే అనేకమంది బీసీ ప్రముఖులకు మేలు జరుగుతుందని అంతా అనుకుంటున్నారు.