పదవులకు బాధ్యత నేర్పే బాబు ప్రయత్నం భేష్!

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా.. కేబినెట్ కు సారథిగా తీసుకున్న కొత్త నిర్ణయం.. ప్రజల్లో ఒక రకమైన సంతోషాన్ని కలిగిస్తోంది. పదవులు కట్టబెట్టడం, పదవులు పొందిన వారు హోదాలను అనుభవించడం మాత్రమే కాదు.. ఆ పదవులు బాధ్యతతో ముడిపడినవి- ఆ బాధ్యతలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి అని గుర్తు చేసే ప్రయత్నానికి చంద్రబాబు శ్రీకారం చుట్టడం శుభపరిణామం అని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు.. తన కేబినెట్ లో పనిచేస్తున్న మంత్రులు అందరికీ.. ఇన్ని నెలల పాటు పనిచేసిన పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

నలభైఅయిదేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈసారి కేబినెట్ కూర్పులోనే ఆయన వైవిధ్యం, విలక్షణతలతో కూడిన తన ముద్ర చూపించారు. ఎటొచ్చీ మేం కేబినెట్ మంత్రులమే అని అనుకుంటూ ఉండే.. అనేకమంది సీనియర్లను పక్కన పెట్టారు. కొత్త రక్తానికి పెద్దపీట వేశారు. యువ కేబినెట్ గా చంద్రబాబు మంత్రివర్గం పనిచేస్తోంది. వీరిలో పలువురు మొదటిసారిగా మంత్రులు అయిన వారున్నారు. ఇలాటి నేపథ్యంలో వారికి హోదాలు  ఇచ్చిన తర్వాత బాధ్యతను కూడా అలవాటు చేయడానికి చంద్రబాబు ర్యాంకుల విధానం తీసుకువస్తున్నారు.
పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు రాంకులు కేటాయించడం జరుగుతున్నదని చంద్రబాబు చెబుతున్నారు. అంతేకానీ ఎవరినీ ఎక్కువ తక్కువ చేయడానికి కాదని ఆయన ముందే స్పష్టత ఇస్తున్నారు. ఫైల్స్ పరిష్కారంలో తన స్థానం కూడా మెరుగుపరచుకోవాల్సి ఉందని ఆయన ఎక్స్ లో వెల్లడించడం విశేషం. మంత్రులకు ర్యాంకులు ఇవ్వడం వల్ల వారిలో పోటీతత్వం పెరుగుతుంది. తమ పనితీరును బేరీజు వేయడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ పనిచేస్తున్నదనే అభిప్రాయం వల్ల.. వారు మరింత జాగరూకతతో పనిచేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలకు, రాష్ట్ర పురోగతికి మేలుచేస్తాయి అని ప్రజలు ఆనందిస్తున్నారు.
ఎమ్మెల్యేలు అందరి పనితీరు మీద కూడా ప్రోగ్రెస్ రిపోర్టులు తయారు చేయనున్నట్టుగా చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఇప్పుడు మంత్రులకు కూడా ర్యాంకులు  ఇస్తున్నారు. ఈ పరిణామాలు నాయకుల్లో ఆశాజనకమైన మంచి మార్పుతీసుకువస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories