‘డీఎస్సీ అంటే చంద్రబాబునాయుడు ద్వారా మాత్రమే సాధ్యం’ అనేది టీచరు ఉద్యోగాల ఆశావహుల్లో ఒక నమ్మకం. ఇప్పుడు టీచరు ఉద్యోగాల్లో ఉన్న వేలాదిమంది.. గతంలో చంద్రబాబు హయాంలో వేసిన డీఎస్సీల ద్వారా నియామకాలు పొందిన వారే. ప్రభుత్వ టీచరు ఉద్యోగం అనేది అందులో ఉండే స్థిరత్వం వల్ల కావొచ్చు..లేదా టెన్షన్ లేని వృత్తి కావడం వల్ల కావొచ్చు.. చాలా మందికి ఒక కల. కానీ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్లు పాలన సాగించినా.. ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయకుండా.. ఎదురుచూసిన వారిని భంగపాటుకు గురిచేశారు. చివరి ఏడాదిలో డీఎస్సీ పేరుతో డ్రామా నడిపించి వారిని మోసం చేశారు. అందుకే ‘తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తామని’ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీకి అనన్యమైన ఆదరణ వచ్చింది. అందలం దక్కింది. గెలిచినప్పుడే డీఎస్సీ ఫైలు మీద సంతకం పెట్టినప్పటికీ.. 2025 విద్యాసంవత్సరం ప్రారంభం లోగా నియామకాలు పూర్తిచేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట నిలబెట్టుకుంటోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
నిరుద్యోగ టీచర్ల తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడింది. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే ఫైలుపై సంతకాలు చేసినప్పటికీ.. డీఎస్సీ నోటిఫికేషన్ దాకా రావడానికి ఇంత కాలం పట్టింది. కొన్ని సాంకేతిక కారణాలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వంటి వ్యవహారాల కారణంగా కాస్త జాప్యం జరిగింది. ఏది ఏమైనప్పటికీ.. 2025 విద్యాసంవత్సరం మొదలయ్యేనాటికి నియామకాలు పూర్తి కావాలనే కృతనిశ్చయంతోనే తొలినుంచి ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే మాట మీద.. నిరుద్యోగుల నిరీక్షణకు తెరదించేసింది.
విద్యాసంవత్సరం పూర్తయ్యేలోగా కొత్త టీచర్లకు అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేయడం అనేది ఎన్నోరకాలుగా వ్యవస్థకు మేలు చేస్తుంది. జూన్ నాటికే స్కూళ్లలో నిండుగా, ఖాళీల్లేకుండా టీచర్లుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన టీచర్ల ద్వారా పిల్లలకు మంచి విద్య అందుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వేలాది మంది డ్రాపౌట్లు అయినట్టుగా ఇటీవల ప్రభుత్వం గణాంకాలు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతమైన వసతులు, మధ్యాహ్న భోజనం, శిక్షితులైన టీచర్లు అందరూ ఉండగా.. విద్యార్థులు తగినంత మంది లేకపోతే అది గత ప్రభుత్వపు వైఫల్యమే. ఇప్పుడు డీఎస్సీ నియామకాల వలన ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.