ఏయే విషయాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విచ్చలవిడిగా వ్యవహరించి భ్రష్టుపట్టిపోయిందో.. అదే విషయాల్లో తాము మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజల నమ్మకాన్ని చూరగొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. జగన్ సర్కారు ఇసుక, లిక్కరు వ్యాపారాల్లోనే వేలకు వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేసి భ్రష్టుపట్టిపోయింది. ఈ రెండు వ్యాపారాల్లోనూ సరికొత్త విధానాలను ప్రకటించడం ద్వారా ప్రజాధానం లూటీకి అడ్డుకట్ట వేయగలిగారు చంద్రబాబునాయుడు. కానీ.. కొత్త విధానంలో కూడా అచ్చంగా ప్రజాధనం కాకపోయినప్పటికీ.. తమ దందాలను, దోపిడీలను కొనసాగించాలని తమ పార్టీ నాయకులు కొందరు ప్రయత్నిస్తుండడం పట్ల చంద్రబాబు సీరియస్ అవుతున్నారు. లిక్కర్ వ్యాపారాలకు లైసెన్సు పొందిన వారిని ఇబ్బంది పెట్టేలా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు ప్రవర్తించినా పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని చంద్రబాబునాయుడు హెచ్చరించడం విశేషం.
లిక్కరు దుకాణాలకు లాటరీ తీయడం గెలిచిన వారికి లైసెన్సులు మంజూరు చేయడం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడిక లిక్కరు వ్యాపారం దందాలో రెండో పార్ట్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల కీలక నాయకులు చాలా మంది తమ ప్రాంతాల్లో లైసెన్సులు పొందిన వారిని బెదిరిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వ్యాపారంలో తమకు వాటా కావాల్సిందిగా కోరుతున్నారని, కోటి రూపాయల వరకు గుడ్ విల్ ఇచ్చేస్తాం లైసెన్సు తమకు అప్పగించి వెళ్లిపోవాలని అడుగుతున్నట్టుగా వినిపిస్తోంది.
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇలాంటి పోకడల పట్ల సీరియస్ గా ఉన్నారు. తమ పార్టీకి చెందిన వారిలో ఎవరెవరు ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నారో తెలుసుకునేందుకు పార్టీ యంత్రాంగంతో పాటు, పోలీసు ఇంటెలిజెన్స్ద్, ఎక్సయిజ్ అధికారుల ద్వారా కూడా చంద్రబాబునాయుడు వివరాలు సేకరిస్తున్నారు.
అయితే ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి కొందరు నాయకులు తాము డిమాండ్ చేస్తున్న వాటాలను తెగేసి చెబుతున్న వీడియోలు బయటకు వచ్చి పార్టీ కొంత భ్రష్టు పట్టింది. జేసీ తనకు పెట్టుబడి లేకుండా 15 శాతం లాభాల్లో వాటా ఇవ్వాలని, 20 శాతానికి సరిపడా పెట్టుబడి పెట్టేలా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన అలా అంటే.. చాలా చోట్ల ఎమ్మెల్యేలు తమకు ఎలాంటి పెట్టుబడి లేకుండా 20 శాతం వాటా లాభాలు ఇవ్వాల్సిందేనని లైసెన్సు పొందిన వారికి టార్గెట్లు నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది. చాలా చోట్ల లైసెన్సు పొందిన వారు మాటలతో లొంగకుంటే బెదిరింపులు చోటుచేసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది.
అయితే చంద్రబాబు మాత్రం.. మద్యం వ్యాపారాలు సజావుగా జరిగేలా, స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే వాతావరణం ఉండేలా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. పార్టీ వారికి కూడా స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఇసుక, మద్యం వ్యాపారాల జోలికి వెళితే పార్టీ భ్రష్టుపడుతుందని ఆయన హెచ్చరిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి చంద్రబాబు చెబుతున్న హితవాక్యాలను పార్టీ ఎమ్మెల్యేలను ఎంతమేరకు చెవిలో వేసుకుంటారో.. ఎంతమంది ఆయన ఆగ్రహానికి గురవుతారో వేచిచూడాలి.