ప్రజలకు తెలిసిన సంగతులే బాబు చెప్పారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ హబ్ గా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నాలు రాష్ట్రవిభజన తర్వాత తొలిరోజుల్లో చాలా చురుగ్గా జరిగాయి. చంద్రబాబునాయుడు పూనికతో అనేక ఐటీ కంపెనీలు విశాఖలో తమ కార్యాలయాలను తెరిచాయి. ఐటీ టవర్స్ ఏర్పాటు అయింది. చాలా కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించగా.. మరికొన్ని సంసిద్ధం అయ్యేదశలో ఉండగా.. జగన్ సర్కారు వచ్చింది. విశాఖకు ప్రత్యేకించిన ఐటీ విప్లవాన్ని జగన్ కొనసాగించి ఉంటే అప్పటినుంచి ఇప్పటివరకు పదుల సంఖ్యలో కొత్త ఐటీ కంపెనీలు కూడా ఇక్కడకు వచ్చి ఉండేవి. నెమ్మదిగా హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై నగరాలకు దీటుగా నిలవగాల ఐటీ కేంద్రంగా విశాఖ విస్తరించి ఉండేది. కానీ జగన్ అలాంటి పని చేయలేదు. ఆల్రెడీ అక్కడ నెలకొల్పిన ఐటీ కంపెనీల మీద రకరకాల ఒత్తిడులు తేవడం ప్రారంభించారు. నెమ్మదిగా ఒక్కటొక్కటిగా ఐటీ కంపెనీలు అక్కడినుంచి తరలిపోయాయి. ఐటీ కంపెనీల కోసం కేటాయించిన భవనాల్ని కూడా తిరిగి తీసేసుకున్నారు. అక్కడ ఆఫీసులు తీసుకున్న వారిని ఖాళీ చేయించారు. వారు ఏకంగా విశాఖ నుంచి మూటాముల్లె సర్దుకుని వెళ్లిపోయారు. ఆ టవర్స్ లో ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయనే నెపంతో జగన్ సర్కారు ఖాళీ చేయించింది. అటూ రాజధాని కూడా రాలేదు. ఉన్న ఐటీ కేంద్రం అనే ఆనందం కూడా విశాఖ వాసుల్లో ఆవిరైపోయింది.  ప్రజల కళ్లముందే ఐటీ కంపెనీలు ఒక్కటొక్కటిగా వెళ్లిపోయాయి.

ఇలా విశాఖ ప్రజలందరికీ చాలా విపులంగా తెలిసిన సంగతినే చంద్రబాబునాయుడు మరోసారి ప్రస్తావించారు. ఆదివారం నాడు పాయకరావుపేటలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన చంద్రబాబునాయుడు.. విశాఖకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విశాఖను తాను ఐటీ కేంద్రంగా మార్చాలని ప్రయత్నిస్తే.. జగన్ అదే విశాఖను గంజాయి కేంద్రంగా మార్చారని కూడా చంద్రబాబు ఆరోపించారు.
ఆ విషయం కూడా నిజమే. ఎందుకంటే.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ మూల గంజాయి రాకెట్ బయటపడినప్పటికీ దాని యొక్క మూలాలు ఏదో ఒకవిధంగా విశాఖలోనే తేలుతున్నాయి. ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే బూటకపు మాట ప్రకటించినతర్వాత.. విశాఖ సిటీ మొత్తం భూకబ్జాలకు, దందాలకు, బెదిరింపులు, భూకుంభకోణాల సంబంధిత క్రిమినల్ కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. ఇలాంటి దుర్మార్గపు పాలనను తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదంటూ చంద్రబాబునాయుడు తన ప్రసంగంలో నిప్పులు చెరిగారు.
విశాఖకు జగన్ హయాంలో జరిగిన ద్రోహం అక్కడ అందరికీ తెలిసినదే. ఆయన మరోసారి పునరుద్ఘాటించడం.. ప్రజల్లో ఆలోచన పుట్టిస్తోంది!

Related Posts

Comments

spot_img

Recent Stories