భయపడిన వారికి భరోసా ఇస్తున్న బాబు

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, చాలా స్వల్ప కాలంలోనే రాష్ట్ర పరిణామాలకు సంబంధించి గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అప్పటిదాకా ఉత్సాహంగా ప్రణాళికలు రచిస్తున్న వారందరూ కూడా తమ తమ వ్యాపారాలకు ప్రత్యామ్నాయ ప్రాంతాలను వెతుక్కున్నారు. చాలా సహజంగా అనేక పెట్టుబడులు పొరుగు రాష్ట్రం తెలంగాణకు తరలిపోయాయి. అలాంటి నేపథ్యంలో ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు చరమగీతం పాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులందరికి ఒక భరోసా కల్పించే మాట చెబుతున్నారు. అభివృద్ధికి అడ్డుపడకుండా జగన్ అనే భూతాన్ని భూస్థాపితం చేస్తానని హామీ  ఇస్తున్నారు. పెట్టుబడిదారులు అందరు ముమ్మరంగా ఏపీలో పనులు చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భారీ పరిశ్రమలు, ఐటీ రంగ పరిశ్రమలు రావడం ఒక ఎత్తు.  సామాన్యులకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మౌలిక వసతుల రంగంలో పురోగతి ద్వారా అన్ని రకాల అభివృద్ధికి మూల కారణంగా మారే రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులు మరో ఎత్తు. అమరావతి రాజధానిగా ప్రకటించి- చంద్రబాబు కసరత్తు చేసిన సమయంలో కేవలం ఆ ప్రాంతంలో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వచ్చాయి. ఆ రంగం పరుగులు తీసింది. అయితే జగన్ తెరమీదకు వచ్చి మూడు రాజధానులు కాన్సెప్ట్ చెప్పగానే మొత్తం చతికిలబడింది. విశాఖలో జగన్ దళాలు సాగించిన భూకబ్జాలు, దందాలు మినహా రాష్ట్రంలో స్తంభించిపోయింది. ఆ మూడురాజధానుల సంగతి కూడా తేలక, మళ్లీ ఏం మార్పులు వస్తాయో తెలియక రియల్ వ్యాపారులు సందేహించారు.

ఏపీలో పెట్టిన పెట్టుబడిన సంగతి మరచిపోయి.. తెలంగాణలో తమ వ్యాపారాలు చేసుకోవడం ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఎంత భారీ పురోగతిని నమోదు చేసిందో, ఇందులో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న వ్యాపారుల వాటా ఎంతో గణాంకాలను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పెట్టుబడిదారులకు భరోసా  ఇస్తున్నారు. హైదరాబాదు వేదిక గానే చంద్రబాబు నాయుడు ఇలాంటి పిలుపు ఇవ్వడం విశేషం. దీంతో స్తంభించిపోయిన ఏపీలోని రియల్ ఎస్టేట్ రంగం త్వరలోనే మళ్లీ పరుగులు తీయడం ప్రారంభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఇతరత్రా పెట్టుబడులు, పరిశ్రమలు కూడా ముమ్మరంగా వస్తాయనే నమ్మకంతోనే ఉన్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories