వరం నెరవేర్చిన బాబు.. పింఛనుదార్ల ఆనందం!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను ఎన్నికలకు ముందు ప్రకటించిన వరాల్లో మరో కీలకమైన హామీని నెరవేర్చారు. వెసులుబాటు ఇవ్వని చిన్న నిబంధన కారణంగా పింఛనుదార్లు, ప్రధానంగా వృద్ధాప్య పింఛను తీసుకునే వయోధికులు జగన్ పాలన కాలంలో నానా కష్టాలు పడుతుండగా.. చంద్రబాబునాయుడు తాను ప్రకటించిన వరాన్ని నెరవేర్చడం ద్వారా వారి కష్టాలు తొలగించారు. వారిలో ఆనందానికి కారణం అయ్యారు. పింఛను దారులు ఇకమీదట.. వరుసగా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా సరే.. మూడో నెల ఆ మొత్తాన్ని కలిపి ఒకేసారి వారికి అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇదే విధానం ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో పింఛను దార్ల మీద పగబట్టినట్టుగా ఈ వెసులుబాటును రద్దు చేశారు. ప్రతినెలా ఒకటోతేదీనే పింఛను తీసుకోవాలని నిబంధన పెట్టారు. ఒక్క నెల పింఛను తీసుకోకపోయినా సరే.. పింఛను ఏకంగా రద్దయిపోతుందని కూడా నిబంధన విధించారు. దీంతో ప్రధానంగా వృద్ధాప్య పింఛన్లు తీసుకునే వారికి అనేక రకాల కష్టాలు ఎదురవుతుండేవి. ఇప్పుడు చంద్రబాబునిర్ణయంతో వారికి ఎంతో మేలు జరగబోతోంది.
వృద్ధాప్య పింఛను తీసుకునే వయసుకు వచ్చిన పెద్దవాళ్లు స్థిరంగా ఒకే చోట ఉండడం అనేది సాధ్యం కాని పని. తమ పిల్లలు వేర్వేరు ఊర్లలో స్థిరపడి ఉంటే వృద్ధులైన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరి వద్ద రెండు మూడు నెలలు ఉంటూ జీవిస్తుంటారు. అయితే జగన్ ప్రభుత్వ కాలంలో పింఛనుకు నిబంధన వలన.. వృద్ధులు పిల్లల వద్దకు వెళ్లి ఉన్నా కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకటో తేదీ  నాటికి ఆపసోపాలు పడుతూ.. పింఛను తీసుకునే ఊరికి రావాల్సి వచ్చేది. అనారోగ్య కారణాలతో చికిత్సలు పొందుతూ ఇతర ప్రాంతాల్లో ఉండేవారు కూడా నానా యాతన పడేవారు. అలాంటి ఇక్కట్లకు చెల్ల్లు చీటీ ఇస్తూ చంద్రబాబునాయుడు మూడునెలలకు ఓసారి పెన్షను తీసుకోవచ్చునంటూ కొత్తగా ఆదేశాలు జారీచేశారు.

ఒక నెల లేదా రెండు నెలలు పింఛను తీసుకోకపోయినా ఆ తర్వాతి నెలలో అన్ని మొత్తాలూ కలిపి ఇస్తారు. అయితే వరుసగా మూడు నెలలు పింఛను తీసుకోకపోతే మాత్రం.. వారిని శాశ్వత వలసదారులుగా గుర్తించి ఆ మరుసటి నెలనుంచి పింఛను రద్దు చేస్తారు. అయితే వారు తిరిగి వచ్చిన తర్వాత పింఛను పునరుద్ధరింలా కూడా వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం ప్రధానంగా పెన్షను తీసుకునే వృద్ధులకు ఎంతో మేలు చేస్తుందని అందరూ ప్రశంసిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories