చంద్రబాబునాయుడు ఇంకా ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయనేలేదు. అంతకంటె ముందే.. ఏ నమ్మకంతో అయితే ఆయనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారో.. ఏ ఆశలతో అయితే ఆయనను ప్రజలు తిరిగి అధికార సింహాసనం మీదికి తీసుకువచ్చారో ఆ ఫలితాలు కనిపిస్తున్నాయి. పదిరూపాయలు ఇస్తూ వంద రూపాయలు దోచుకోవడానికి జగన్ కనిపెట్టిన మార్గాల్లో ఒకటైన చెత్తపన్ను విషయంలో ప్రజలు ఎంతగా ఆగ్రహోదగ్రులు అయ్యారో అందరికీ తెలుసు. చంద్రబాబునాయుడు తన ఎన్నికల ప్రచారంలో.. తాము అధికారంలోకి రాగానే చెత్తపన్నును తొలగిస్తాం అని ప్రకటించారు. ఆయన ఇంకా అధికారం చేపట్టలేదు గానీ.. అప్పుడే తన మాట మాత్రం నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు చెత్తపన్ను వసూళ్లు నిలిపివేయాలని మునిసిపాలిటీలకు, కార్పొరేషన్లకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.
చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ, స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్లనుంచి నెలకు 30నుంచి 150 రూపాయల వరకు లెక్కవేసి.. దాదాపు ఏడాదిలో 200 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే చెత్తపన్ను పేరుతో ఈ దోపిడీని తెలుగుదేశం, జనసేన మొదటినుంచి వ్యతిరరేకిస్తూనే ఉన్నాయి. ఒకవైపు ప్రతి ఏడాదీ 15శాతం ఆస్తి పన్ను పెంచుతున్నారు. మళ్లీ కొత్తగా చెత్తపన్ను ఏంటని ప్రజలు బాధపడుతూ వచ్చారు.
కేవలం పన్ను వసూళ్ల భారం మాత్రమే కాదు.. ఎవరైనా చెల్లించడంలో ఆలస్యం చేసినా, నిర్లక్ష్యం చేసినా వారిపట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ వచ్చారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో సేకరించి తెచ్చిన చెత్త మొత్తం.. ఇంకా పన్ను చెల్లించని వారి ఇంటి ఎదుట కుమ్మరించేసి వారిని వేధించారు. ఇలాంటి దుర్మార్గాలపై పలు సందర్భాల్లో కోర్టుల్లో కేసులు కూడా పడ్డాయి. ఎన్ని జరిగినా సరే.. జగన్ సర్కారు వైఖరిలో మార్పు రాలేదు.
ప్రజల్లో చెత్త పన్ను పట్ల విపరీతమైన ఆగ్రహం పెల్లుబుకుతుండడాన్ని గమనించిన తెలుగుదేశం పార్టీ.. ఎన్నికల సమయంలో.. స్పష్టమైన హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి రాగానే చెత్తపన్ను ఎత్తివేస్తామని చంద్రబాబునాయుడు అన్నారు. ఆ మాటను అధికారంలోకి రాకముందే నిలబెట్టుకోవడం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.