బాలీవుడ్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ “రామాయణ”పై దేశవ్యాప్తంగా ప్రేషకులలో భారీ ఆసక్తి నెలకొంది. ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో వచ్చిన పౌరాణిక ఇతిహాసాన్ని ఈ తరం ప్రేక్షకులకు అద్భుతంగా చూపించేందుకు రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ పరంగానూ ఆశ్చర్యం కలిగించే రీతిలో ఉండబోతోంది.
ఈ సినిమాలో రామ్ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ పట్ల ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఉత్తరాదినే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా చుట్టూ మంచి బజ్ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వార్తలన్నీ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ సినిమా కోసం వినిపిస్తున్న సమాచారం ప్రకారం మొత్తం బడ్జెట్ దాదాపు రూ.1600 కోట్లు అంటున్నారు. ఇది విన్నవెంటనే అందరి దృష్టి ఈ సినిమాలో నటించే తారల పారితోషికాల మీదకి వెళ్లింది. తాజా బజ్ ప్రకారం, రామ్ పాత్రలో కనిపించనున్న రణ్‌బీర్ కపూర్ ఈ రెండు పార్టులకు కలిపి రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవికి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా నటుల రెమ్యునరేషన్ విషయంలో బయటకి వచ్చిన ఈ రేట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చకు మార్గం వేశాయి. ప్రధాన తారలే కాకుండా ఇతర కీలక పాత్రల్లోనూ ఆసక్తికర నటీనటులు ఎంపికయ్యారు. రాక్షస రాజు రావణుడి పాత్రలో కేజీఎఫ్ ఫేమ్ యష్ కనిపించనున్నాడు. లక్ష్మణుడిగా రవి దూబె, హనుమాన్ పాత్రలో సన్నీ డియోల్ నటించనున్నట్లు తెలిసింది.
ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని 2026లో దీపావళికి, రెండో భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేసేలా పనులు జరుగుతున్నాయి. మొత్తం మీద, శృతిప్రాయం కధను కొత్తగా చెప్పేందుకు బాలీవుడ్ ప్రయత్నిస్తున్న ఈ రామాయణం ప్రాజెక్ట్‌పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.