అత్యంత సమస్యాత్మకమైన కడపజిల్లాలో రెండు మండలాల జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని పోలీసులు చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు మండలాల్లోనూ చాలా పెద్దసంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. అలాగే.. అనేక మంది పార్టీల నాయకుల్ని, రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. తాజాగా మంగళవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కీలకమైన కొందరు నాయకుల్ని అరెస్టు కూడా చేస్తున్నారు. కొందరు నాయకుల్ని హౌస్ అరెస్టు చేస్తుండగా, మరికొందరు నాయకుల్ని అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు.
మంగళవారం ఉదయం కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఆయన ఇంటివద్ద అరెస్టు చేసి తరలించారు. అవినాష్ రెడ్డి అరెస్టుతో.. మంగళవారం నాటని ఎన్నిక సాయంత్రం వరకు కూడా ప్రశాంతంగా జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కడపజిల్లాలో ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా, ఘర్షణలు చెలరేగకుండా, ఎన్నికలను నిర్వహించడం ఒక్కటే ప్రయారిటీగా పోలీసులు భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే వారు కేవలం ఎంపీ అవినాష్ రెడ్డిని మాత్రమే కాదు.. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఎన్నికలు జరుగుతున్న పరిధిలో.. ఉద్రిక్తతలకు కారణం కాగలరని భావిస్తున్న అందరు నాయకులను కూడా హౌస్ అరెస్టులు లేదా అరెస్టులు చేయడానికి పోలీసులు వెనుకాడడం లేదు. ఈ విషయంలో పార్టీల రాగద్వేషాలను వారు పక్కన పెడుతున్నారు. వైసీపీ నేతల్లాగానే తెలుగుదేశం వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. పంచాయతీ సర్పంచి లక్ష్మీనారాయణ, వైసీపీ నాయకుడు సతీశ్ రెడ్డి లను కూడా హౌస్ అరెస్టు చేశారు.
కేవలం నాయకుల అరెస్టులు, నిర్బంధం మాత్రమే కాదు.. తతిమ్మా అన్ని విధాలుగా కూడా.. పోలింగ్ ప్రజాస్వామ్యబద్ధంగా, రిగ్గింగ్ కు అవకాశం లేకుండా జరిగేలా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు ఐజీ పులివెందుల లోను, జిల్లా ఎస్పీ ఒంటిమిట్టలోను తిష్టవేసి.. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తుండడం వల్ల వైసీపీ నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎన్ని రకాల ఆంక్షలు, ఏర్పాట్లు ఉన్నప్పటికీ.. తాము తలచినట్టుగా రిగ్గింగు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. అయితే అది ఇప్పుడు సాధ్యం కావడం లేదు. అనుకున్నట్టుగా రిగ్గింగు కుదరకపోతే భీతావహవాతావరణం సృష్టించాలని కుట్రలు పన్నినట్టుగా పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని గుసగుసలున్నాయి. అందువల్లనే పలువురు వైసీపీ నాయకులను అరెస్టు చేశారని తెలుస్తోంది. ఈ అరెస్టుల వల్ల సాయంత్రం దాకా ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని అంతా భావిస్తున్నారు.