పాపం అవినాష్ రెడ్డి! ఒకవైపు వైఎస్ షర్మిల, మరోవైపు సునీత ఆయనను బంతాట ఆడుకుంటున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఆయన అని గట్టిగానే చెబుతున్నారు. వివేకాను చంపిన వారిని గెలిపిస్తారా, హంతకులను ఎంపీగా చేస్తారా? అంటూ బహిరంగంగా నిలదీస్తున్నారు. వారి దాడిని తట్టుకోవడం, అందుకు ప్రజల యెదుట సంజాయిషీలు చెప్పుకోవడమే పెద్ద తలనొప్పిగా ఉండగా.. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన కమలాపురం సిటింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి జగన్ మేనమామ రవీంద్ర నాధ రెడ్డి మరో రకంగా అవినాష్ ను ఈ హత్య కేసులో ఇరికించేస్తున్నారు. తెలిసి చేశారో, తెలియక చేశారో తెలియదు గానీ.. రవీంద్రనాధరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అవినాష్ రెడ్డికి మరింత ఇరకాటంగా మారుతున్నాయి.
ఇంతకూ రవీంద్రనాధ్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఆధారాల్ని ఎర్ర గంగిరెడ్డి తుడిచేస్తూ ఉంటే.. ఎంపీ అవినాష్ రెడ్డి చూస్తూ నిలబడ్డాడని’’ అన్నారు. ఎన్నికల ప్రచారకార్యక్రమంలో బహిరంగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అది కూడా సభలో.. ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కూడా పక్కనే ఉండగా.. అవినాష్ ను ఒక చేత్తో చూపిస్తూనే రవీంద్రనాధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి.
ఈ వ్యాఖ్యల ద్వారా.. వివేకా హత్యకు గురైన సంగతి అవినాష్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. ఆయనను హత్య చేసిన వారు.. హత్యకు గల ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నించారనే సంగతి కూడా ఆయనకు తెలుసు. స్వయంగా నెత్తురును తుడిచివేయడం మొత్తం ఆయన కళ్లెదురుగానే జరిగింది అనే సంగతి బాగా అర్థం అవుతోంది.
పాపం అవినాష్ రెడ్డి.. అసలు వివేకా హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ.. అంతా ముగిసిపోయిన తర్వాత మాత్రమే తాను అక్కడకు వచ్చానని.. ఇన్నాళ్లూ తనను విచారిస్తున్న సీబీఐ అధికార్లకు ఎన్నెన్ని కల్లబొల్లి కబుర్లు చెప్పుకుంటూ రోజులు నెట్టుకువచ్చారో తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా ఆధారాలు చెరపివేసే ప్రక్రియ మొత్తం అవినాష్ కళ్లెదురుగానే జరిగిందని స్వయంగా రవీంద్రనాధ్ రెడ్డి చెప్పడం విశేషమే. అవినాష్ సీబీఐకు చెప్పుకున్న కల్లబొల్లి కబుర్లను తిరగతోడి.. ఆయన కళ్లెదురుగానే ఆధారాలు చెరపివేశారా? ఆయన ఎదుటే నెత్తరు మరకల్ని తుడిచేశారా? అలా హత్య చేసిన వారు రక్తం తుడిచేస్తోంటే.. అవినాష్ రెడ్డి చూస్తూ ఎందుకు నిల్చున్నారు. పోలీసులను మభ్య పెట్టాలని ముందే ఫిక్సయి ఉన్నారా? లేదా, అవినాష్ రెడ్డి పురమాయింపుతోనే ఎర్ర గంగిరెడ్డి నెత్తురు మరకలు తుడిచేశారా? అనే అనేక రకాలైన సందేహాలకు ఇప్పుడు సమాధానాలు దొరకాలి.
బహుశా.. రవీంద్రనాధ్ రెడ్డి వెల్లడించిన విషయాలు.. సీబీఐ వద్ద గతంలో అవినాష్ చెప్పిన వివరాలకు భిన్నంగా ఉంటే వారు ఏది నిజమో తేల్చడానికి ఇంకా కొన్ని నెలలు పట్టవచ్చు. కానీ.. ప్రజల వద్ద అంత టైముండదు. అవినాష్ ఇప్పుడు ప్రజా కోర్టులో ఉన్నారు. ఇంకో 30 రోజుల్లో ప్రజలు తీర్పు కూడా చెప్పేస్తారు. అవినాష్ పాత్ర ఉన్నదని, రవీంద్రనాధ్ రెడ్డి వ్యాఖ్యల వల్ల ప్రజలు నమ్మితే అవినాష్ ను దారుణంగా ఓడిస్తారని ప్రజలు అనుకుంటున్నారు.