ఇదేమీ రాజకీయ వ్యవహారం కాదు. తమ నాయకుడిని దూషించారని, సదరు నాయకుడి కళ్లలో సంతోషం చూడడానికి పాల్పడే దుశ్చర్యలు కాదు. సాక్షాత్తూ దేవదేవుడి పట్ల జరిగిన అపచారానికి ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం. అలాంటి ఆగ్రహం ఏ రూపంలోకైనా మారే అవకాశం ఉంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం మీద కొందరు భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం అనేది ఇప్పుడు ఆ పార్టీ వారికి ఎదురుదాడికి అవకాశం ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారంటూ.. వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి తరుణంలో ప్రజలు చెబుతున్న మాట ఏంటంటే.. ‘‘మీ పార్టీ ఆఫీసు మీద దాడి జరిగితే, ప్రజల్లో మీ పట్ల ఉన్న ఆగ్రహం చల్లారిపోతుందేమో అని ఎదురుచూడండి. సంతోషించండి. ఆ దాడి కూడా జరగకపోతే, ప్రజాగ్రహం మీ పార్టీ రాజకీయ భవిష్యత్తుకే సమాధి కట్టేస్తుంది’’ అని అంటున్నారు.!
అయినా వైసీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి అంటూ వారి ఫిర్యాదు కూడా చాలా కామెడీగా ఉంది. వైసీపీ ఆఫీసు వద్దకు బిజెవైఎం కార్యకర్తలు వెళ్లిన మాట నిజం. వారు అక్కడ కేవలం ధర్నా చేయడానికి, నిరసన తెలియజేయడానికి మాత్రమే వెళ్లినట్టుగా ఆ వర్గం చెబుతోంది. వారు వైసీపీ ఆఫీసు ప్రహరీ గేటు దాటి లోపలకు వెళ్లలేదు కూడా. అయినా ఆ పార్టీ మాత్రం విధ్వంసానికి కుట్ర అని అంటోంది. ధర్నా చేస్తున్నవారిని సెక్యూరిటీ సిబ్బంది చెదరగొట్టడంతో కాస్త ఘర్షణ ఏర్పడింది. సెక్యూరిటీ వలయం దాటి బిజెవైఎం వారు లోపలకు చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.
బిజెపి పెద్దలతో సత్సంబంధాలు కోరుకునే జగన్మోహన్ రెడ్డికి ఈ పరిణామం చేదుగా ధ్వనించవచ్చు. బిజెవైఎం వారు స్వయంగా పార్టీ ఆఫీసు వద్ద నిరసనలకు వస్తున్నారు. నిజానికి ఆయన పట్ల, ఆయన పరిపాలన పట్ల అసహ్యభావం బిజెవైఎంలో మాత్రమే ఉన్నదా అనుకోవడానికి వీల్లేదు. రోడ్డెక్కి నిరసనలు తెలియజేయడానికి పూనుకోవడం లేదు గానీ.. హిందూ భక్తులు ప్రతి ఒక్కరిలోనూ జగన్ పట్ల అసహ్యం పేరుకుపోతున్నదని ప్రజలు అంచనా వేస్తున్నారు.