ఆయన కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడాలనే అనుకున్నారు. ఒకవైపు చంద్రబాబు తనకు ఎంతో మంచి మిత్రుడు అని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకుంటూ ఉండే మంచు మోహన్ బాబు.. ఎన్నికల సమయంలో మాత్రం.. తనకు చేతనైనంత స్థాయిలో ఆయనకు అపకీర్తి పులిమి.. ఆ మేరకు జగన్ కు లబ్ధి చేయాలని అనుకున్నారు. అందుకే ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిసినప్పటికీ.. కనీసం పోలీసు అనుమతి తీసుకోవాలనే స్పృహ కూడా లేకుండా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును బద్నాం చేయడానికి తిరుపతిలో ధర్నా నిర్వహించారు. తప్పు ఎప్పుడు చేసినా సరే.. ఎప్పటికీ వదలిపెట్టదు అన్నట్టుగా.. దాదాపు ఆరేళ్ల కిందట చేసిన ఆ నేరానికి ఇప్పుడు ఆయన కోర్టుకు హాజరు కావాల్సి వస్తోంది.
కేసు కొట్టేయాలంటూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించినా కూడా ఆయనకు ఆశించిన ఫలం దక్కలేదు.
2019లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. తమ విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సర్కారు ఎలాంటి ఫీజు రీఇంబర్స్‌మెంట్ చెల్లించలేదని ఆరోపిస్తూ.. మార్చి 22న మంచు కుటుంబం తిరుపతిలో ధర్నా నిర్వహించింది. తిరుపతి మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ అంతా కలిసే ఆ ధర్నాలో పాల్గొన్నారు. మార్చి 22న ఈ ధర్నా జరిగింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ.. విద్యార్థులతో కలిసి చేసిన ఈ ధర్నా నిబంధనలకు వ్యతిరేకం అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజం చెప్పాలంటే.. వీలైనంత వరకు చంద్రబాబు మీద బురద చల్లి.. ఆ మేరకు జగన్ కు ఎన్నికల్లో లబ్ధి చేకూరేలా చేయాలనే వ్యూహంతోనే మోహన్ బాబు అలా చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చారు గానీ.. ఆయన లేవనెత్తిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ సమస్య ఆయనతో కూడా ఒక పట్టాన తేలలేదు. ఆయన కుక్కిన పేనులా ఉండిపోయారు. కానీ.. పోలీసు కేసు మాత్రం ఉండిపోయింది. పోలీసులు నమోదుచేసిన చార్జిషీట్ ను కొట్టేయాలంటూ.. ఆయన 2021 లో కోర్టుకు వెళ్లారు. తిరుపతి మేజిస్ట్రేటు కోర్టులో ఆయన మీద కేసు ఉండగా.. దానిని కొట్టేయాలంటూ ాయన ఏకంగా సుప్రీం కోర్టు వరకు వెళ్లారు. తాజాగా ఈ పిటిషన్ పై తీర్పు చెప్పిన సుప్రీం ధర్మాసనం.. శుక్రవారం జరిగే తిరుపతిలో మేజిస్ట్రేటు కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని తీర్పు చెప్పింది. కేసు కొట్టేయడానికి నిరాకరించింది. కనీసం తిరుపతి మేజిస్ట్రేటు కోర్టులో విచారణ సమయంలో వ్యక్తిగత హాజరునుంచి మినహాయింపు కావాలని మోహన్ బాబు న్యాయవాది కోరినప్పుడు కూడా.. సుప్రీం పట్టించుకోలేదు.
జగన్ కళ్లలో ఆనందం కోసం ఓవరాక్షన్ చేసి తాను బావుకున్నదేం లేదు గానీ.. కోర్టుకు హాజరు కావాల్సిన దుస్థితి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు.