సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ పేరుతో తన తండ్రి పరిపాలన సాగించిన కాలంనుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తూ వచ్చిన భూదందాకు ఇప్పుడు తెరపడే ప్రమాదం కనిపిస్తోంది. ఏ సరస్వతి పవర్ లో అయితే.. తల్లికి గిఫ్టు డీడ్ కింద ఇచ్చిన షేర్లు కూడా తనకు వెనక్కు కావాలంటూ.. జగన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసి.. అనైతిక పోరాటం సాగిస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. తల్లికి హక్కుగా ఇచ్చిన వాటాలను కూడా తిరిగి లాక్కోవాలని చూస్తున్న జగన్ కుత్సిత పన్నాగాలను ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల ఇప్పటికే పలు రకాలుగా ఎండగడుతున్నారు కూడా. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సదరు సరస్వతీ పవర్ ను ఉంచుకోవాలా? వదిలించుకోవాలా? అనే మీమాంసలో పడే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే.. ఈ కంపెనీ ముసుగులో ఆయన తన పరం చేసుకున్న దాదాపు 1200 ఎకరాల భూమిలో సుమారు 17 ఎకరాల అసైన్డ్ భూములు ఉండగా.. వాటిని తాజాగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వెనక్కు తీసుకుంది.
తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో వైఎస్ జగన్.. సరస్వతీ పవర్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. తర్వాత దానిని సిమెంట్ తయారీ సంస్థగా కూడా మార్చారు. దానికి మాచర్ల ప్రాంతంలో దాదాపు 1200 ఎకరాలను రైతలునుంచి కొనుగోలు చేశారు. ఫ్యాక్టరీలు వస్తాయని, స్థానికులు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని, వారి సంక్షేమం బాధ్యతలు అన్నీ చూస్తామని నమ్మబలికి.. ముఖ్యమంత్రిగా వైఎస్ ఉన్న హవాను వాడుకుని.. కారుచవకగా భూములు కొన్నారు. ఆ తరువాత.. వైఎస్ హయాంలోనే సున్నపురాళ్ల గనుల లీజును తమ కంపెనీ పేరిట పొందారు. లీజులు నీటికేటాయింపుల అనుమతులు పొందారే తప్ప.. వీసమెత్తు పని కూడా ప్రారంభించలేదు. 2014 తర్వాత చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరస్వతీ సంస్థకు ఇచ్చిన గనుల లీజు అనుమతులు రద్దు చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తన కంపెనీలకు మళ్లీ గనుల లీజులు కేటాయించుకున్నారు. ఒకసారి దక్కిన సీఎం చాన్స్ తనకు శాశ్వతంగా ఉండిపోతుందని అనుకున్న జగన్ మరింత ఎక్కువ కాలం పాటు లీజులు ఇచ్చుకున్నారు.
తాజాగా సరస్వతీ సంస్థకు గడ్డు రోజులు వచ్చాయి. 1200 ఎకరాల భూముల్లో వేమవరం, పిన్నెల్లి పరిధిలోని దాదాపు 17 ఎకకరాల అసైన్డ్ భూములుండగా ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకుంది. ఇది జగన్ సరస్వతి సామ్రాజ్యానికి ఒక చిన్న కుదుపు అని చెప్పాలి. అయితే ఆ సంస్థ పేరిట గత ప్రభుత్వం ఇచ్చిన గనుల లీజు అనుమతులు, నీటి కేటాయింపులు అన్నింటినీ ప్రభుత్వం త్వరలోనే రద్దు చేయబోతున్నట్టుగా కూడా అమరావతి వర్గాల ద్వారా తెలుస్తోంది. అనుమతులు తీసుకుని అసలు ఉత్పత్తి ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నందుకు అనుమతులు రద్దు చేయబోతున్నట్టుగా సమాచారం. అదే జరిగితే.. ఈ 1200 ఎకరాలు జగన్ కు ఎందుకూ పనికిరాని ఆస్తిగా మారుతాయని అంతా అనుకుంటున్నారు.