వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం మంచి ఫలితాలనే ఇచ్చింది. తాను ముఖ్యమంత్రి కాగానే.. జగన్ అదే ఉత్తరాంధ్ర మీద కన్నేశారు. విశాఖపట్నానికి రాజధాని తీసుకువస్తా అని చెబుతూ.. ఆ ప్రాంతంలోని భూసంపదల మీద కన్నేశారు. జగన్ దళాలన్నీ అక్కడి భూములన్నీ కాజేయడానికి రంగంలోకి దిగాయి. పైకి మాత్రం రాజధాని వస్తే.. ఉత్తరాంధ్ర మొత్తం దివ్యంగా అభివృద్ధి చెందిపోతుందంటూ టముకు వేశారు. కానీ.. జగన్ దళాలు సాగిస్తున్న దందాలను గమనించిన ఉత్తరాంధ్ర ప్రజలు భీతావహులైపోయారు. జగన్ మళ్లీ గెలిస్తే.. రాజధాని వచ్చేస్తుందేమోనని, అదే జరిగితే తమ ప్రశాంతంగా సాగుతున్న తమ బతుకులు సర్వనాశనం అవుతాయని కూడా వారు భయపడ్డారు. అందుకే టోటల్ ఉత్తరాంధ్రలో దారుణంగా ఆ పార్టీని ఓడించారు. మొత్తం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు కలిపి జగన్ కేవలం ఒక్క ఎంపీ సీటు (అరకు), రెండు ఎమ్మెల్యే సీట్లు (అరకు, పాడేరు) మాత్రమే గెలిచారు.
రాజధాని అనే పదం యొక్క ముసుగులో జగన్మోహన్ రెడ్డి గానీ, ఆయన అనుచర గణాలు గానీ.. ఎంతెంత పెద్ద దందాలు నడిపించాయో ప్రజలందరూ గమనించారు. సీనియర్ నాయకుడు మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజధాని గురించి పలికిన చిలకపలుకులను కూడా గుర్తు చేసుకోవాలి. జగన్ మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి పేరుతో మాయమాటలు చెప్పారు గానీ.. అదంతా బూటకం అనే సంగతిని కూడా నిజానికి ధర్మాన ప్రసాదరావు బయటపెట్టేశారు. శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అనడం ఉత్తుత్తి రాజధానులేనని.. విశాఖ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా చలామణీ అవుతుందని ఆయన చెబుతూ వచ్చారు. రాజధాని అనే మాట పట్టుకుని ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక సభలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను పోరాటాలకు ప్రిపేర్ చేయడానికి కూడా ధర్మాన ప్రయత్నించారు.
అదే సమయంలో విశాఖ రాజధాని అవుతోందంటూ.. జగన్ అనుచరులైన దందాలు చేసేవారు ప్రవేశించి పాల్పడిన భూకబ్జాలు విచ్చలవిడి అయ్యాయి. రాజధాని అవసరాలకోసం, టూరిజం భవనం ముసుగులో రుషికొండను బోడికొండగా మార్చేసి కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా జగన్ సాగించిన విధ్వంస ప్రక్రియ యావత్తూ ప్రజలను భయపెట్టింది. ఇలాంటి భయాలు అన్నీ కలిసి ప్రేరేపించడం వల్లనే ఉత్తరాంధ్ర ప్రాంతం సమష్టిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఛీత్కరించుకున్నదని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది.