జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఇప్పుడు రాష్ట్రంలో హాట్‌టాపిక్ గా మారుతోంది. జనసేనకి ఉమ్మడి గుర్తుగా దానిని కేటాయించిన తర్వాత కూడా మిగిలిన నియోజకవర్గాల్లో ఫ్రీ సింబలుగా ఆ గుర్తు అందుబాటులో ఉండడం అనేది ఈ వివాదానికి మూల కారణం. అలాగే చాలా నియోజకవర్గాలలో ఇండిపెండెంట్ లు గాజు గ్లాస్ గుర్తు తీసుకోవడం అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చే అంశం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని పవన్ కళ్యాణ్- ఏ ఆశయంతో అయితే భారతీయ జనతా పార్టీని కూడా ఒప్పించి తెలుగుదేశంతో తాము కూడా కలిసి జట్టు కట్టారో ఆ ఆశయం ఇప్పుడు సమూలంగా దెబ్బతినిపోతున్నది. అది కూడా పవన్ కళ్యాణ్ పార్టీ రూపంలోనే దెబ్బ పడుతున్నది. ఈ పరిణామంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. బుధవారం నాడు తీర్పు వెలువడుతుంది. జనసైనికులకు తప్ప మిగిలిన ఇండిపెండెంట్లు ఎవరికీ కూడా ఈ గాజు గ్లాసు గుర్తు లేకుండా నిర్ణయం వస్తుందని ఆశావహంగా ఎదురుచూస్తున్నారు.
తెలుగుదేశం కూటమిలోని మిత్రపక్షాలను తెలుగుదేశం పార్టీని కుట్రపూరితంగా దెబ్బకొట్టే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రాంగం చేసిందనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎన్నికల సంఘం ఇలాంటి కుట్రకు పాల్పడిందని అనడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే వారు నిబంధనల ప్రకారమే వెళ్తుంటారు. అయితే అనుకోకుండా కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దళం బాగా వినియోగించుకుంటున్నారు.
జనసేన హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తమ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడిగా ఈ గుర్తుని కేటాయించిన తర్వాత మిగిలిన నియోజకవర్గాలలో ఫ్రీ సింబల్ జాబితా నుంచి తొలగించాలని తాము ఎన్నికల సంఘాన్ని ముందే కోరినట్టుగా ఆ పార్టీ న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది మాట్లాడుతూ వారి ఫిర్యాదు పై 24 గంటల్లోగా ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసు కూడా బుధవారానికి వాయిదా పడింది.
గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్ లకు ఉండడం కూటమి పార్టీలకు చాలా పెద్ద సీరియస్ సమస్య. కనుక హైకోర్టు ఈ విషయంలో వాస్తవ దృష్టితో ఆలోచించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రకారం ఇండిపెండెంట్ లకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును తక్షణం రద్దుచేసి వారికి వేరే గుర్తు ఇవ్వవలసిందిగా అవసరమైతే అందుకు సంబంధించిన నష్టపరిహారాన్ని కూడా చెల్లించవలసిందిగా హైకోర్టు ఆదేశించే అవకాశం ఉన్నది అని పలువురు భావిస్తున్నారు.