తల్లితో మొక్కుబడిగా.. చెల్లెలికి ఎదురుపడకుండా..

వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం.. ఆయన సొంత కుటుంబంలో ఉన్న విభేదాలను మరోసారి స్పష్టంగా బయటపెట్టింది. కుటుంబ పరువును రచ్చకీడ్చింది. ఆ కుటుంబంలో అందరికీ ఉన్న ఆస్తులన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉండగా, ఆయన సీఎంగా ఉండగా సమకూరినవే అయినప్పటికీ.. వాటికోసం ఉన్న ముగ్గురూ ఏ స్థాయిలో కొట్టుకుంటున్నారో అందరికీ తెలుసు. కేవలం ఆస్తుల కోసం కుటుంబ బంధాలను అత్యంత నీచంగా దిగజార్చేసి తలపడుతుండడం వారికే చెల్లింది.

జయంతి రోజున వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించడానికి ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్దకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ ఇంచుమించుగా ఒకే సమయంలో వచ్చారు. అప్పటికే వైఎస్ సమాధికి పూలతో అలంకరించి ఉంచారు. జగన్ తొలుత ఒక పూలమాలను సమాధిపై అలంకరించగా, ఆ తర్వాత విజయమ్మ కూడా మరొక పూలమాలను అలంకరించారు. అక్కడే కూర్చుని ఇద్దరూ కొద్ది సేపు ప్రార్థనలు చేశారు. తర్వాత.. జగన్ అక్కడినుంచి వెళ్లిపోవడానికి సిద్ధమైనప్పుడు కొంచెం ఎడంగా నిల్చుని ఉన్న తల్లి విజయమ్మ ను వెనుకనుంచి భుజంపై తట్టి.. తాను బయల్దేరుతున్నట్టుగా సైగ చేశారు. ఆమె దగ్గరకు వెళ్లి.. కౌగిలించుకుంది. ఆ తర్వాత జగన్ అక్కడినుంచి వెళ్లిపోయారు.

జగన్ వెళ్లిపోయిన తర్వాత.. కొద్దిసేపటికి వైఎస్ షర్మిల తండ్రి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. వైఎస్ జ్ఞాపకార్థం హైదరాబాదులో స్మృతివనం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన కోరికను నెరవేరుస్తుందని ఆశిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఈ విషయంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా లేఖ రాసినట్లు షర్మిల వెల్లడించారు.
అయితే ఇడుపులపాయలో నివాళులు అర్పించే సందర్భంగా అన్నా చెల్లెళ్లు అసలు ఎదురుపడకపోవడం గమనార్హం. అలా ఎదురుపడకుండా ఉండేలాగానే వారు టైమింగ్స్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రెండు రోజులుగా కడప జిల్లాలోనే ఉన్న షర్మిల.. జగన్ అరాచకత్వం వలన త్రిశంకు స్వర్గంలో ఉన్న వైఎస్సార్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ విద్యార్థులను కూడా కలిసి.. వారి ఆందోళనకు మద్దతు తెలియజేసిన సంగతి తెలిసిందే.

జయంతి రోజున నివాళి అర్పించే సమయంలో గతంలో ఇద్దరూ తారసపడినప్పటికీ ఒకరినొకరు పలకరించుకోకుండానే వెళ్లిపోవడం జరిగింది. ఈ దఫా అసలు ఎదురుపడకుండానే.. వేర్వేరు సమయాల్లో సమాధి వద్దకు వచ్చారు. తల్లి విజయమ్మ, జగన్ కు తారసపడినప్పటికీ కూడా వారి మధ్య ఇదివరకటి ఆప్యాయతలు కనిపించలేదని పలువురు అనుకుంటున్నారు. తల్లి పట్ల తనకు గతంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని అందువల్లనే ఆమెకు గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన షేర్లను వెనక్కు తీసుకోవాలనుకుంటున్నానని జగన్ ట్రిబ్యునల్ లో దావా నడుపుతున్న సంగతి తెలిసిందే. 

Related Posts

Comments

spot_img

Recent Stories