పిన్నెల్లి అరెస్టు : ఇప్పటిదాకా ఆగడమే పెద్ద పైరవీ!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలింగు సందర్భంగా జరిగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒక పోలింగుబూత్ లో పిన్నెల్లి స్వయంగా దూసుకెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన సీసీ కెమెరాల ఫుటేజీలో చాలా స్పస్టంగా రికార్డు అయింది.

ఆ కేసుల్లో పిన్నెల్లికి కనీసం ఏడేళ్లు జైలు శిక్ష పడేలా కేసులు నమోదు చేశాం అని అప్పట్లోనే ఎన్నికల ప్రధానాధికారి మీనా చెప్పారు కూడా. ఆయన అరెస్టు విషయంలో సుదీర్ఘమైన హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను బుధవారం హైకోర్టు కొట్టివేసిన తర్వాత.. పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

అయితే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇప్పటిదాకా జాప్యం చేయడమే ప్రజలకు ఆశ్చర్యార్థకంగా ఉంది. ఎందుకంటే.. బూత్ లో దూరి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియోలు బయటకు వచ్చినప్పుడే.. పిన్నెల్లిని అరెస్టుచేసి ఉండాల్సింది. ఆయన చాలా చక్కగా, ప్రశాంతంగా రాష్ట్రం వదిలి హైదరాబాదు పారిపోయేదాకా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు.

ఆ తర్వాత కూడా ఈసీ సీరియస్ అయి కేసులు నమోదుచేసిన తర్వాత.. ఆయనను అరెస్టుచేయడానికి ఏపీ పోలీసులు హైదరాబాదు వెళ్లి.. ఆయన ఇంటి ముందు మోహరించే ఉన్నారు. ఆయన కారులో బయటకు వచ్చాక చేజ్ చేశారు.  ఇంతా కలిపి.. ఆయన కారును, డ్రైవరును మొబైల్ ఫోనుతో సహా ఒకచోట వదలి పరారయ్యారు. మద్రాసు పారిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. కోర్టులో పిటిషన్లు వేసిన తర్వాత.. కౌంటింగ్ కు అభ్యర్థిగా ఆయన హాజరయ్యే అవకాశం కూడా కల్పిస్తూ.. 6వ తేదీ వరకు ఆయన మీద చర్య తీసుకోవద్దని మాత్రం కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటిదాకా అరెస్టు జరగలేదు.

ఆయన ముందస్తు బెయిలు కోసం హైకోర్టులో పిటిషన్లు వేశారు. తాజాగా బుధవారం నాడు హైకోర్టు ఈ బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన తర్వాత మాత్రమే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో జరిగిన విపరీతమైన హింసాకాండకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. ఈ కేసుల్లో ఆయన పాత్రకు వీడియో సాక్ష్యాలు కూడా స్పష్టంగా ఉండడంతో త్వరగానే శిక్షలు తేలే అవకాశం ఉంది. ఆయనకు ఎంత కాలం శిక్షపపడుతుందనే దాన్ని బట్టి.. రాజకీయ జీవితం, భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories