భాజపా సహా తెలుగుదేశం, జనసేన జట్టు కట్టడం.. ఎన్నికలకు సర్వసన్నద్ధంగా సమరాంగణంలోకి దిగడం వైసీపీ దళాలకు వణుకు పుట్టిస్తున్నది. వారి పొత్తులను ఏదో ఒక విధంగా నీరుగార్చాలని, వారి పొత్తుల కూటమిపై ప్రజల్లో అపనమ్మకం కలిగించాలని నానాపాట్లు పడుతున్నారు. ఏ వ్యవహారం పీకల మీదకు వచ్చినా సరే.. వైసీపీ పార్టీ మొత్తం.. ఒకటే స్క్రిప్టు ఫాలో అవుతుందని, ఎవ్వరూ కూడా సొంత బుద్ధితో పనిచేసే అవకాశమే ఉండదని అందరికీ తెలిసిన సంగతే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన బాటలో ఇతరులు మాట్లాడుతున్న మాటలు ఒకే తీరుగా ఉంటున్నాయి. వారి మాటలు గమనిస్తే చాలు.. ఎంత భయంలో ఉన్నారో.. ఏదో ఒకటి కౌంటర్ ఇస్తే చాలని అనుకుంటున్నారో మనకు అర్థమైపోతోంది.
ఇంతకూ సజ్జల ఏమంటున్నారంటే.. ఈ మూడు పార్టీలు కూడా 2014లో పొత్తులు పెట్టుకున్నాయి. ప్రజలను మోసం చేశాయి. ఇప్పుడు మళ్లీ అదే నాటకాన్ని రిపీట్ చేస్తున్నాయి. ప్రజలను మోసం చేయడానికి మళ్లీ వస్తున్నాయి అని అంటున్నారు. ఆయన ప్రజలను భయపెడుతూ.. కూటమికి ఓటు వేయవద్దని హెచ్చరిస్తూ చెబుతున్న మాట ఏంటంటే.. ఈ కూటమి గెలిస్తే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అని అంటున్నారు.
ఇక్కడే ప్రజలకు అసలు సందేహం రేకెత్తుతోంది. చంద్రబాబు ప్రభుత్వం వస్తే ఇప్పటి పథకాలన్నీ ఆగిపోతాయనేది వైసీపీ దళాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. పథకాల పేరుతో ప్రజల్ని భయపెట్టి లబ్ధి పొందాలని వారు అనుకుంటున్నారు. అయితే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అందరూ కూడా.. ఏ ఒక్క పథకం కూడా ఆగేది ఉండదని, మరింత సమర్థంగా ఆ పథకాలను మరింత సమర్థంగా అమలు చేస్తామని పలు సందర్భాల్లో ప్రకటించారు. అంత క్లారిటీగా చెబుతున్నా ప్రజల్లో అనుమాన బీజాలు విత్తడానికి వైసీపీ కుటిలయత్నం చేస్తోంది.
అదే సమయంలో.. జగన్ మళ్లీ గెలిస్తే గనుక.. ఇక అమరావతి రాజధాని అనే ఆలోచన కూడా బతకదని, ఇప్పటికే స్మశానంలాగా మారిన ఆ ప్రాంతం ఎప్పటికీ ఎందుకూ పనికిరాకుండా పోతుందని మరోవైపు తెలుగుదేశం దళాలు ఆరోపిస్తున్నాయి. జగన్ మూడు రాజధానులు అనే పదంతో ఎన్ని డ్రామాలు ఆడుతున్నప్పటికీ.. దానిని నమ్ముతున్న వారు తక్కువే. అలాగే విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అనే ప్రతిపాదనకు ఉత్తరాంధ్రలో కూడా సరైన మద్దతు లభించడం లేదు.
ఇప్పుడు ఈ రెండు పార్టీల వాదనలను ప్రజలు తక్కెడలో పెట్టి తూకం వేసుకుంటున్నారు. చంద్రబాబు గెలిస్తే పథకాలు అమలు కావు- అని వైసీపీ అంటోంది. కానీ.. వారి ప్రచారం అబద్ధం అన్ని పథకాలూ కొనసాగుతాయి అని చంద్రబాబు చెబుతున్నారు.
జగన్ గెలిస్తే అమరావతి రాజధాని సర్వనాశనం అవుతుందని చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తున్నారు. మరి వారి ప్రచారం అబద్ధం అని చెప్పగల ధైర్యం మాత్రం వైసీపీ వారికి ఇసుమంత కూడా లేదు. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని, రాష్ట్ర ప్రజల కలల్ని సర్వనాశనం చేసిన వైసీపీ ఇప్పుడు ఏమీ చేయలేని స్థితిలో , కౌంటర్ ఇవ్వలేని స్థితిలో ఉంది.
అందుకే ఈ రెండు పార్టీల కీలక ప్రచారాల్ని బేరీజు వేసుకున్నప్పుడు సజ్జల అండ్ కో ప్రచారం తేలిపోతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.