జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఫలితాలు వెలువడిన రోజునుంచే వారి తొలగింపు అమల్లోకి వస్తుందని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నెలకు రెండులక్షల రూపాయలకు పైగా వేతనాలు తీసుకుంటూ, వాటికి తగుమాత్రం హోదా వైభవాలను అనుభవిస్తూ ఉన్న, జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు చేసిన సేవలకు ప్రత్యుపకారంగా, పునరావాసంగా సలహాదారుల పదవులను దక్కించుకున్న వారి దందాలకు తెరదించేసినట్లు అయింది. సలహాదారులను తొలగించడం మాత్రమే కాదు, వారి సేవలకోసం నియమించుకున్న వ్యక్తిగత సిబ్బంది అందరినీ కూడా పూర్తిగా తొలగిస్తూ జీఏడీ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
జగన్మోహన్ రెడ్డి.. తాను ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తన వెంట ఉండి, తనకు సేవ చేసిన వారందరికీ అధికారంలోకి రాగానే పునరావాసం కల్పించారు. వారి పునరావాసానికి సలహాదారులు అని పేరు పెట్టారు. తమాషా ఏంటంటే.. ప్రభుత్వం, సీఎం కు ఒకరో ఇద్దరో సలహాదారులు ఉండడం సహజమే. కానీ జగన్ ఏకంగా వివిధ మంత్రిత్వ శాఖలకు కూడా సలహాదారులను నియమించారు. తన సాక్షి పత్రికలో పనిచేసిన వారిని, తాను కాళ్లు మొక్కే స్వాములు సూచించిన వారిని, ఇతరత్రా తన పైరవీలకు ఉపయోగపడిన వారిని ఇలా రకరకాలుగా ఏకంగా నలభై మంది సలహాదారులు తయారయ్యారు. నెలకు రెండులక్షలకు పైగా జీతాలు, కారు, ఛాంబర్, వ్యక్తిగత సహాయక సిబ్బంది.. ఈ కతలన్నీ కలిపి.. ప్రతినెలా ప్రభుత్వాన్ని కోట్ల రూపాయల భారం సలహాదారుల రూపంలో పడేది.
సలహాదారుల వ్యవస్థ గురించి పలుమార్లు హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. కొత్త పైరవీతో కొత్త నియామకం జరిగిన ప్రతిసారీ ఓ కేసు పడేది. హైకోర్టు ఈ కతలన్నీ చూసి ఆశ్చర్యపోయేది. ప్రభుత్వ శాఖలకు కూడా సలహాదారులు ఉంటే ఇక ఐఏఎస్ లు ఉన్నదెందుకు అని హైకోర్టు ప్రశ్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్ని జరిగినా జగన్ వైఖరిలో మార్పురాలేదు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కూడా.. తన సాక్షి ఛానెల్ లో సేవలు చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి.. ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టి.. పార్టీకి పైరవీలకు సేవలకు వాడుకున్నారు. సాక్షి ఎడిటర్ గా పనిచేస్తూ ప్రభుత్వం రాగానే సలహాదారుగా మారిన సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి అక్కడ సలహాలుచెబితే వినేవాళ్లు లేరని, ఆ పదవి అవమానకరంగా ఉన్నదంటూ రాజీనామా చేయడం కూడా జరిగింది.
తమాషా ఏంటంటే.. జగన్ దారుణంగా ఓడిపోయిన తర్వాత.. అధికారులే సెలవుపెట్టి వెళ్లిపోతున్నారు. కానీ.. అడ్డదారుల్లో వచ్చిన ఈ సలహాదారులు రాజీనామా చేయకుండా పదవుల్ని పట్టుకుని వేళ్లూడుతూ ఉండడమే! అలాంటి వారినందరినీ జీఏడీ ఒక్క ఉత్తర్వుతో పదవులనుంచి తొలగించింది. అసలు సలహాదారుల ట్యాగ్ లైన్ ఉన్నవాళ్లు ప్రభుత్వం మారిన తర్వాత.. కనీస అవమానం ఫీలవకుండా, సిగ్గులేకుండా ఇన్నాళ్లూ ఆ పదవుల్లో ఎందుకు కొనసాగారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.