ఒక్కరోజు మీడియాలో, పత్రికల్లో కనిపించకపోతే.. అక్కడితో తన రాజకీయ జీవితం అంతమైపోయినట్లేనని భయపడే రకానికి చెందిన నాయకుల్లో భూమన కరుణాకర రెడ్డి కూడా ఒకరు. గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకటీ అరా పరవాలేదు. అంతకుమించి.. టీటీడీ ఛైర్మన్ గా ఆయన మాటలకు వార్తల విలువ ఉండేది. కానీ.. ఇప్పుడు మాజీ అయిన తర్వాత.. సొంత కరపత్రికలో తప్ప ఆయన గోడు ఎవ్వరికీ పట్టదు. అలాంటిది సొంత పత్రిక కూడా తనను పట్టించుకోకపోతే.. తన వార్తలు రాయకపోతే.. ఆయన ఎంతగా కంగారుపడతారో కదా. అలాంటి కంగారులోనే తాజాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును, టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడును తిట్టిపోశారు.
అయితే తమాషా ఏంటంటే.. ఆయన లేవనెత్తిన అంశాన్ని బట్టి.. ఆయన ఎంత ఎక్కువగా మాట్లాడితే.. అంతగా ఆయన పార్టీ అధినేత జగన్ పరువే పోతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
భూమన కరుణాకర రెడ్డి , ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి గురించి నానా తిట్లు తిడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఆయన సుదీర్ఘమైన విమర్శలతో వీడియో విడుదల చేస్తే.. సాక్షి దినపత్రికలో ఒక లైను కూడా రాయలేదు. చానెల్ లో ఒక నిమిషం కూడా చూపించలేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న రోజుల నుంచి కూడా.. జగన్ సాగించిన అనేకానేక అవినీతి కార్యకలాపాలలో వై శ్రీలక్ష్మి కీలక పాత్రధారి కావడంతో.. ఆమె మీద చేసిన విమర్శలను జగన్ చానెళ్లు, పత్రిక తొక్కిపెట్టాయి. తాను ఏం మాట్లాడినా సరే.. తనకు చిరాకు పుట్టి ముగించే వరకు లైవ్ ప్రసారంలో చూపిస్తూ ఉండే సాక్షి చానెల్ కూడా తనను పట్టించుకోకపోయేసరికి భూమనకు కంగారు పుట్టింది.
ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి.. బీఆర్ నాయుడును, చంద్రబాబునాయుడు తిట్టడంద్వారా.. మళ్లీ తన కవరేజీ సాధించుకున్నారు. యథావిధిగా ఆయన ఓపెన్ చేసిన దగ్గరినుంచి.. ముగించి ఇంటికెళ్లేవరకు సాక్షి లైవ్ అందించింది. ఆయనకే సబ్జెక్టు లేక.. చెప్పిందే చెబుతూ చూస్తున్నవారికి విసుగు పుట్టించారు. పైగా నా మీద సీబీఐ విచారణ వేయండి అంటూ సవాళ్లు విసరడం తప్ప.. ఆయన మాటల్లో కించిత్తు పసకూడా లేకుండాపోయింది.
ముంతాజ్ హోటల్ కు టీటీడీ స్థలాన్ని కేటాయించి జగన్ మోహన్ రెడ్డి పాపానికి ఒడిగడితే.. ఆ కేటాయింపుల్ని రద్దుచేసి.. అలాగని ఆ ప్రాజెక్టు వెనక్కు వెళ్లిపోకుడా టూరిజం నుంచి మరో చోట స్థలం తీసుకుని, టూరిజం ద్వారా మరో చోట ముంతాజ్ హోటల్ కు ఇచ్చేలా చంద్రబాబు8 ప్రభుత్వం వివాదరహితమైన ఏర్పాటుచేసినందుకు కరుణాకరరెడ్డికి కడుపు మండుతున్నట్టుగా ఉంది. టీటీడీ స్థలాన్ని టూరిజంకు ఎందుకిచ్చారంటూ ఆయన అర్థం పర్థంలేని విమర్శలు చేస్తున్నారు. తనమీద సీబీఐ విచారణ కావాలని అడిగినంత మాత్రాన.. ఆయన పరిశుద్ధుడు అయిపోతాడా? అని ప్రజలు నవ్వుకుంటున్నారు.