పులివెందుల పూలంగళ్ల దగ్గర పంచాయతీకి సిద్ధమా?

వైఎస్ షర్మిల .. తన ప్రచారపర్వంలో జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచర గణాలకు ఊపిరి ఆడనివ్వని పరిస్థితి క్రియేట్ చేయడం, ఆమె ప్రచారాన్ని వైకాపా శ్రేణులు ప్రతిఘటిస్తుండడం వంటి వ్యవహారాలు కడప జిల్లాలో సెకండ్ ఫేజ్ కు చేరుకున్నాయి. అసలు షర్మిలకు ప్రతిఘటనలు మొదలు కాకముందు.. ఆమె సభల్లో ఏకపక్షంగా వివేకా హత్య గురించి, హంతకుడని అంటూ అవినాష్ గురించి, హంతకులను కాపాడుతున్నారంటూ జగన్ గురించి తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. ప్రతిఘటనల ఫస్ట్ ఫేజ్ లో.. జగన్ అభిమాని ఒకరు షర్మిల ప్రసంగిస్తుండగా వచ్చి ఆమె పక్కన నిల్చుని.. ఆమె కడప రాజకీయాల్లోకి రావడం తమకు ఇష్టంలేదని, తామంతా జగన్ తోనే ఉంటాం అని మైకుతీసుకుని మరీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని లింగాల మండలంలో షర్మిల బస్సు యాత్ర పర్యటిస్తున్నప్పుడు.. వైసీపీ శ్రేణులు ఇంకా తీవ్రస్థాయిలో ప్రతిఘటించాయి. వైకాపా జెండాలు పట్టుకుని వచ్చిన కార్యకర్తలు.. షర్మిలకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నినాదాలకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈలోగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.

అయితే షర్మిల  మాత్రం వైసీపీ కార్యకర్తల ప్రతిఘటనలకు బెదిరిపోలేదు. ‘అవినాష్ రెడ్డికి ఓడిపోతానని భయం పట్టుకుంది. అందుకే తనను అడ్డుకునేందుకు మనుషుల్ని పంపుతున్నారంటూ’ రెచ్చిపోయారు. బాబాయిని చంపిన సంగతి కుటుంబ విషయం కాదు. ప్రజానాయకుడు వివేకా హత్య విషయం. చంపిన వారిని జగన్ పక్కన పెట్టుకున్నారు. వారిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. హంతకులకు జగన్ అండగా నిలబడినందుకే కడప ఎంపీగా పోటీచేస్తున్నా అంటూ షర్మిల సూటిగా పేర్కొన్నారు.

తన పర్యటనలో అల్లర్లు చేస్తున్న వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి.. ‘అల్లరి చేసేవాళ్లు పులివెందులకు రండి. పూల అంగళ్ల వద్ద పంచాయతీ పెడదాం. వివేకాను ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం..’ అంటూ షర్మిల వారికి సవాలు విసిరారు.

సాధారణంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా తమ తమ ఎన్నికల ప్రచార సభల్లో జగన్ మీద తీవ్రమైన నిందలు వేస్తున్నాయి. చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటనలో.. వివేకా హత్య వ్యవహారాన్ని ప్రముఖంగానే ప్రస్తావించారు. షర్మిల తరహాలోనే.. హంతకులను కాపాడడానికి జగన్ ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే వారెవ్వరికీ కూడా వైసీపీ దళాలనుంచి ప్రతిఘటన ఎదురు కాలేదు. వారి సభల్లో వైసీపీ నిరసనలు వ్యక్తం కాలేదు. అయితే షర్మిల సభలను మాత్రం వైసీపీ వారు టార్గెట్ చేస్తున్నారంటే ఆమె సభలకు భయపడుతున్నట్టుగా అనిపిస్తోంది. అవినాష్ రెడ్డిలోనే ఓటమి భయం మొదలైందని.. అందుకే షర్మిల సభలను భగ్నం చేయడానికి తమ పార్టీ వారిని పంపుతున్నారని కడప జిల్లా ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories