మీలో మీరు కొట్టుకుంటూ చంద్రబాబుపై ఏడుపా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముసలం తారస్థాయికి చేరుకున్న వాతావరణం కనిపిస్తోంది. కింది స్థాయి నాయకుల మధ్య నిత్యం కాట్లాటలు నడుస్తూనే ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన నాయకులుగా చలామణి అయిన వారు.. లోలోపల ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకుంటూ ఉండేవారు తప్ప, బహిరంగంగా బయటపడి అల్లరి పాలైనది గతంలో లేదు. కానీ విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పర్వం కూడా కనుల ముందు కనిపిస్తున్నది. వైసీపీ అగ్ర నాయకుల బండారాలు, ఒకరి ద్వారా మరొకరి తప్పుడు వ్యవహారాలు.. బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా వాళ్లలో వాళ్లు కొట్టుకు చస్తుండగా తగుదునమ్మా అంటూ ఒక నాయకుడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు మీద నిందలు వేయడం.. ఇదంతా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం అని వ్యాఖ్యానించడం చాలా కామెడీగా కనిపిస్తోంది.

జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీ ఏర్పడిపోయినదని పార్టీకి రాజీనామా చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారు. ఈ కోటరీ కారణంగా తాను మూడున్నరేళ్ల పాటు అనేక అవమానాలు భరించానని కూడా అన్నారు. పార్టీలో ఒక్కొక్క మెట్టు దిగుతూ వచ్చానని ఆ మెట్లను కుట్రలు చేసిన ఇతర నాయకులు అందుకుంటూ పైకి ఎగబాకారని కూడా ఆరోపించారు. జగన్ తప్పుడు మాటలు విని చెడిపోతున్నారన్నట్లుగా ఆయన సెలవిచ్చారు. జగన్ కలవడానికి కూడా కోటరీ నేతలు అడ్డుగా నిలిచి దందాలు, వసూళ్లు చేస్తున్నారు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు.. ఇన్ని జరిగిన తర్వాత, వీటిని ఖండించడానికి నెల్లూరు జిల్లాకే చెందిన మరొక నాయకుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డిని తెరమీదకు తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

విజయసాయి చెప్పిన కోటరీ మాటలన్నీ వాస్తవాలే కదా అని ఆయన లోలోపల ఉన్నదో ఏమో కానీ నేరుగా వాటిని ఖండించడం కంటే ఈ మాటలను చంద్రబాబుకు ముడిపెట్టి లబ్ధి పొందడానికి కాకాని ప్రయత్నిస్తున్నారు. విజయసాయి చేసిన ఆరోపణలన్నీ కూడా చంద్రబాబు తెరవెనుక నించి నడిపిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ అని ఆరోపించడం కాకాని గోవర్ధన్ రెడ్డి యొక్క చవకబారు రాజకీయానికి నిదర్శనం అని పలువురు విమర్శిస్తున్నారు. తాను రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుందనే వాస్తవం తెలిసినా పదవిని వదులుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి గతంలోనే చెప్పారు. అయితే అదేదో ఆ సంగతి తాను ఇప్పుడే కనుగొన్నట్లుగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు సాయం చేయడానికి విజయసాయి రాజీనామా చేసినట్లు అభివర్ణించడం పాచిపోయిన సంగతి!

తమాషా ఏమిటంటే.. జగన్ చుట్టూ కోటరీ ఏర్పడిందని విజయసాయిరెడ్డి ఎవరినైతే ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో వారెవ్వరూ కూడా అతిజాగ్రత్తతో మీడియా ముందుకు రాలేదు. మీడియా శరపరంపరగా ప్రశ్నలు సంధిస్తే కోటరీ భాగోతాల గురించి నేర్పుగా సమాధానాలు చెప్పగలం అనే ధైర్యం వారికి లేదు. అందుకే కాకాని గోవర్ధన రెడ్డి అనే పావును ముందుకు నడిపి ఆయన ద్వారా మాట్లాడిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories