తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార ప్రతినిధి, కాకినాడ ప్రాంత నాయకుడు మహాసేన రాజేశ్ మీద ఇప్పుడు పోలీసు కేసు నమోదు అయింది. మహాసేన రాజేష్ మరియు ఆయన అనుచరుల మీద శంకరగుప్తం అనే గ్రామానికి చెందిన శాంతి అనే మహిళ ఈ నెల 12 వతేదీన పోలీసులకు ఫిర్యాదుచేసింది. మార్ఫింగ్ ఫోటోలతో తన మీద అనుచిత పోస్టులు పెట్టారనేది ఆమె ఫిర్యాదు. అయితే ఆమె పేర్కొన్న మార్ఫింగ్ ఫోటోల గురించి ఫేస్ బుక్ సంస్థనే వివరణ కోరిన పోలీసులు- రెస్పాన్స్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఉన్నారు. ఈలోగా రాజేశ్ మాత్రం.. తన పేరుతో ఎవరో నకిలీ ఖాతాలు తెరిచి ఈ పోస్టులు పెట్టారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మహాసేన రాజేశ్ ను నిందితుడిగా చూపించడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతున్నది గానీ.. ఈ వ్యవహారంలో చాలా లొసుగులు కనిపిస్తున్నాయి.
ఫిర్యాదు చేసిన శాంతి ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో తనమీద పోస్టులు పెట్టినట్టుగా చెబుతున్నారు. అలాంటప్పుడు.. నవంబరు నెలదాకా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఎందుకున్నారు? అనేది తొలి సందేహం. ఆమె చెబుతున్న కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మహాసేన రాజేశ్ తెలుగుదేశానికి చెందిన వ్యక్తి. ఆరోజుల్లోనే ఆమె ఫిర్యాదు చేసి ఉంటే.. వైసీపీకి అనుకూలంగా అప్పట్లో పనిచేసిన పోలీసు దళాలు కఠినంగానే శిక్షించి ఉండేవారు కదా.. 9-10 నెలలు ఆమె ఎందుకు వెయిట్ చేశారు అనేది పెద్ద డౌటు!
అలాగే ఫిర్యాదు చేసిన శాంతి భర్త నాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్త. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లను కించపరిచేలా పోస్టులు పెట్టినందుకు సదరు నానిమీద ఇటీవల రాజోలులో కేసులు నమోదు అయ్యాయి. భర్త నాని మీద తెలుగుదేశం వారు కేసులు పెట్టిన తర్వాత.. శాంతి తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టింది.
ఇదేదో ఉద్దేశపూర్వకంగా కౌంటర్ ఎటాక్ లాగా తెలుగుదేశం వారిని ఇరికించాలని అనుకున్నట్టుగా ఉంది తప్ప.. కేసులో నిజం లేదేమో అని పలువురు సందేహిస్తున్నారు. శాంతి ఆవేదన నిజమే అయితే గనుక.. పోస్టులు పెట్టినప్పుడే కేసు వచ్చి ఉండాలి. పైగా అప్పట్లో వారి ప్రభుత్వమే ఉంది. ఇదంతా కలిపి విశ్లేషిస్తే.. తన పేరుతో నకిలీ ఎవరో ఖాతాలు తెరిచి ఈ పోస్టులు పెట్టారంటూ రాజేష్ చెబుతున్న మాటలే నిజమైనవని తేలుతుందేమో అనుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు నేతలు మరీ అంతగా దిగజారుతున్నారా? తమ మీద కేసులు నమోదు కాగానే తమ ఇంట్లోని ఆడవాళ్లతో తెలుగుదేశం వారి మీద నకిలీ కేసులు పెట్టిస్తున్నారా? మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు పలువురికి కలుగుతున్నాయి.