పాల్వాయిగేటు పాపులు ఇద్దరు మాత్రమేనా?

మాచర్ల నియోజకవర్గం పరిధిలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో జరిగిన అరాచకం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటు. అక్కడ ఎవరో దుండగులు, ఆకతాయిలు, రౌడీలు ఈవీఎంను పగులగొట్టలేదు. ఆ పాత్రలన్నీ తానే పోషిస్తాను అన్నట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పగులగొట్టారు. ఆయన సిటింగ్ ఎమ్మెల్యే కావడం.. అన్నింటికంటె పెద్ద సిగ్గుచేటు వ్యవహారం.

తెనాలి నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. ఓటరు మీద దాడిచేసి కొట్టడం, తన గూండాలతో చితక్కొట్టించడం ఘటనలోనే ప్రజాస్వామ్యం చితికిపోయింది. అంతకుమించి.. ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కేయడానికి నిదర్శనమైన ఘటన పాల్వాయి గేటు ఈవీఎం పగలగొట్టడం ఘటన. అది కూడా.. సిటింగ్ ఎమ్మెల్యే!!

అంత పబ్లిగ్గా సిటింగ్ ఎమ్మెల్యే ఈ దారుణానికి పాల్పడితే.. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ పనిచేసినట్టు కేసు నమోదు అయింది. ఆ పాపానికి బాధ్యత ఎవరిది? మొత్తానికి ఇన్ని రోజుల తర్వవాత సరైన సమాచారం ఇవ్వలేదంటూ పీఓను, ఏపీవోను సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరి మీద చర్య సరిపోతుందా, అదికూడా సస్పెన్షన్ తో చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఆ అధికారులు చేసినది పొరబాటు కాదు, ఉద్దేశపూర్వకమైన కుట్ర. కనీసం పోలింగు బూత్ లో సీసీ కెమెరా ఉన్నదని, అందులో తమ చర్యలు మొత్తం రికార్డు అవుతాయనే వెరపు కూడా లేకుండా.. పోలింగ్ అధికారులు లేచి నిల్చుని అభ్యర్థికి నమస్కారాలు పెట్టడం చాలా దారుణమైన సంగతి. అంత చేసిన వాళ్లు ఆర్వోకు సమాచారం ఇవ్వకుండా ఉంటారనే అనుకోవాలా? ఇంత ఉద్దేశపూర్వకంగా అరాచకానికి పాల్పడిన అభ్యర్థిని కాపాడే ప్రయత్నం చేసిన వారిని కేవలం సస్పెన్షన్ తో సరిపెడతారా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.

ఈ  వ్యవహారం ఇలా సాగడానికి కారణం కాగల నిర్లక్ష్యం  ఏయే అధికారులదో వారందరి మీద కూడా చర్యలుండాలి. సమస్యాత్మక నియోజకవర్గంలో, అలాంటి పోలింగ్ కేంద్రంలో  అతి తక్కువ పోలీసు బలగాలను కేటాయించిన అధికారులపై కూడా చర్యలుండాలి. అవేమీ లేకుండా.. ఇద్దరిని సస్పెండ్ చేసి, పిన్నెల్లి అరెస్టుకు పోలీసులను పురమాయించినంత మాత్రాన సరిపోతుందా? అనేది ప్రజల సందేహం. మరి ఈసీ ఈ వ్యహారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్టు ఎలా నిరూపించుకుంటుందో?

Related Posts

Comments

spot_img

Recent Stories