జగన్మోహన్ రెడ్డి తమకు విపరీతమైన అన్యాయం జరిగిపోతున్నదని, కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకుని తమను వేధిస్తున్నదని, అరాచకాలు సృష్టిస్తున్నదని.. ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు గుప్పిస్తుంటారు. కోర్టుల్లో కేసులు వేస్తుంటారు. గవర్నరును కలిసి ఫిర్యాదుల చేస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తే అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కడపజిల్లా పోలీసు యంత్రాంగంలో పూర్తిగా వైఎస్ జగన్ కోవర్టులే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. అవినాష రెడ్డికి కొమ్ముకాయడానికి, జగన్ దళాలకు అనుకూలంగా ప్రవర్తించడానికి వారు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప.. కనీసం తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలని కూడా అనుకోవడం లేదు. అందుకే కడపజిల్లా పోలీసుయంత్రాంగంలో ఎవరు నియమితులైనా.. జగన్ వారిని తన కోవర్టులుగా మార్చుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది.
వివరాల్లోకి వెళితే..
పోలింగ్ నాడు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇరు పార్టీల నుంచి కీలక నాయకుల్ని అరెస్టు చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఈ అరెస్టు పర్వం సవ్యంగా నడిచిపోయింది. అదే సమయంలో.. వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటికి వెళ్లారు. మొరాయించిన ఆయనను ఎత్తుకుని జీపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే… పోలీసుల్లో కనీసం ఒక్కరు కూడా ఉన్నతాధికారులకు సహకరించలేదు. అవినాష్ రెడ్డిని తాకడానికే వారు భయపడ్డారు. దీంతో గతిలేక డీఎస్పీ, సీఐ మాత్రమే.. ఆయనను మోసుకుంటూ తీసుకువచ్చి వాహనంలో కూర్చోబెట్టారు.
ఇంతా కలిపి వాహనంలో తరలిస్తుండగా.. ఎర్రగుంట్ల వద్ద వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు వారితో కలిసి రోడ్డుపై కూర్చుని నిరసన తెలియజేసిన అవినాష్ రెడ్డి పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. ఇంకోరకంగా చెప్పాలంటే.. అక్కడ కాపలా ఉన్న పోలీసులు అవినాష్ కు సహకరించారు. ఆయన ఏకంగా మూడు పోలీసు చెక్ పోస్టులు దాటుకుని మరీ.. పులివెందులలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడిదాకా ఆయన వెళ్లడానికి పోలీసులు సహకరించారు.
అంటే.. కడప పోలీసు యంత్రాంగంలో ఉన్నతాధికారులు మొత్తం.. అంతా జగన్ కోవర్టులే ఉన్నట్టుగా కనిపిస్తోంది. స్థానిక పోలీసులు సహకరించపోవడంతో.. స్వయంగా డీజీపీ కోయప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్.. అక్కడకు వెళ్లి అవినాష్ తిరిగి స్టేషనుకు రావల్సిందిగా హెచ్చరించాల్సి వచ్చింది. దాని పర్యవసానమే డీఐజీ కోయ ప్రవీణ్ కు తెలుగుదేశం నాయకులతో బంధుత్వాల్ని అంటగడుతూ ఆయన గురించి దుష్ప్రచారం చేయడానికి జగన్ ప్రయత్నించడం కూడా.
ఈ పరిణామాలను గమనిస్తే.. కడపజిల్లాలో స్థానిక పోలీసులు పూర్తిగా జగన్ దళాల కంట్రోల్ లో ఉంటూ వారికి కోవర్టులుగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది.