రెండు వారాల్లో ఓడలు బండ్లయ్యాయా?

‘మా కార్యకర్తల మీద బైండోవర్లు, రౌడీషీట్లు వేస్తున్నారు’
‘ప్రజలను, మా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు’
‘మామీద దాడులు జరుగుతోంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు’
‘పోలీసులను అడ్డు పెట్టుకుని మమ్మల్ని అంతమొందించాలని చూస్తున్నారు’
‘మళ్లీ మా ప్రభుత్వం వస్తుంది.. ఇప్పుడు గీత దాటి వ్యవహరిస్తున్న అధికారులు అందరూ అప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’
.. ఈ డైలాగులు అన్నీ ఎక్కడైనా విన్నట్టుగా అనిపిస్తోందా? మీరు అనుకుంటున్నది నిజమే. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గత అయిదేళ్లుగా మొరపెట్టుకుంటున్న విషయాలే ఇవన్నీ కూడా! అయిదేళ్ల పాటూ కొన్ని వందల సందర్భాల్లో ఇలాంటి మాటలు మనం తెదేపా నాయకుల నుంచి విన్నాం. చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సొంత ఎంపీ రఘురామక్రిష్ణ రాజు కూడా.. ‘పోలీసులను అడ్డుపెట్టుకుని నన్ను అంతం చేయాలని జగన్ ప్రభుత్వం చూస్తున్నది’ అనే ఆరోపణలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసి కేవలం రెండు వారాలు మాత్రమే అవుతోంది. అప్పుడే బండ్లు ఓడలయ్యాయా? లేదా, ఓడలు బండ్లయ్యాయా? అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ఈ మాటలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ప్రత్యేకించి.. అయిదేళ్ల పాటూ అప్రకటిత హోం మంత్రిగా, సకల శాఖల మంత్రిగా రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం అంతటినీ తన కనుసైగలతో శాసించిన సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇప్పుడు ఈ బేలపలుకులు పలుకుతున్నారు.
పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి ఒక్కడి మీద కేసులు నమోదు అయినందుకే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుదేలైపోతూ, కిందామీదా అయిపోతోంది. పిన్నెల్లి మీద కేసులు పెట్టడం అన్నదే తెలుగుదేశం పార్టీతో పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు అంతా కుమ్మక్కు అయిపోయినట్టే అని మాట్లాడుతున్నారు. పిన్నెల్లి ముఠా దాడిలో తలకు గాయమైన సీఐ ఆలస్యంగా కేసు పెట్టడం కూడా నేరమేనట. పదిరోజుల పాటు ఆ సీఐ నిద్రపోతున్నారా? అని సజ్జల రామక్రిష్ణారెడ్డి రంకెలు వేస్తున్నారు.
ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ముకాస్తున్న అధికారుల, పోలీసుల పేర్లు నోట్ చేస్తున్నామని.. తమ ప్రభుత్వం వచ్చాక వారి సంగతి చూస్తామని తెలుగుదేశం వారు హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు పాపం.. ఓడలు బండ్లయ్యాయి. ఇన్నాళ్లూ అధికారంలో ఉంటూ పోలీసుల్ని తమ చెప్పుకింద చీమల్లా చూసిన వారు.. ఇలాంటి బేల పలుకులు పలుకుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories